రమణ దీక్షితులను సాగనంపారే...!

Update: 2018-05-16 12:12 GMT

తిరుమల దేవస్థానం ప్రధానార్చకులు రమణ దీక్షతులను తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పాటైన టీటీడీ బోర్డు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలోనే 65 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రమణ దీక్షితులతో పాటు అర్చకులు నారాయణ దీక్షతులు, వెంకటరమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు తమ పదవులను కోల్పోనున్నారు.

విమర్శలు చేసిన 24 గంటల్లోనే...

రమణ దీక్షితులను వయస్సు సాకుగా చూపించి తప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం చైన్నైలో విలేకరులతో మాట్లాడిన రమణ దీక్షితులు తిరుమల ఆచార వ్యవహారాల్లో పాలకుల జోక్యం పట్ల పలు తీవ్ర విమర్శలు చేశారు. ఆలయంలో ఆగమ శాస్త్రాన్ని తుంగలో తొక్కెలా పరిపాలన సాగుతుందని ఆయన ఆరోపణలు చేశారు. ఆలయ వ్యవహారాల్లో పాలకుల జోక్యం పెరిగిందని ఆయన విమర్శించారు.

ఇది హిందూ మతంపై దాడి....

1996లో సుప్రీంకోర్టు అర్చక వ్యవహారంలో పాలకమండలి జోక్యం చేసుకోవద్దని తీర్పు ఇచ్చిందని రమణ దీక్షతులు పేర్కొన్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఇది హిందూ మతంపై జరిగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. విమర్శలు చేసిన 24 గంటల్లోనే రమణ దీక్షితులను తొలగించేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం ముదిరే అవకాశం ఉంది. ఇది క్రమంగా రమణ దీక్షితులకు, ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారనుంది.

Similar News