నాడి దొరకడం లేదే ..!!

Update: 2018-12-09 09:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు విశ్లేషకులను సైతం తలలు పట్టుకునేలా చేసింది. హైదరాబాద్ మినహాయిస్తే భారీ పోలింగ్ నమోదు అయిన తీరు గమనిస్తే ప్రధాన పక్షాల నడుమ యుద్ధం హోరా హోరీగా జరిగినట్లు తేలుతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ ఓటింగ్ పెరగడం వల్లే భారీ పోలింగ్ జరిగినట్లు అంచనా వేస్తుంది. మరో పక్క ప్రభుత్వ వ్యతిరేక పవనాలు గట్టిగా వీయడం వల్లే ఓటింగ్ శాతం బాగా పెరిగిందని ప్రజాకూటమి అంచనా వేస్తుంది. ఇలా ఎవరి అంచనాల్లో వారు ఒకటికి రెండు సార్లు బూత్ ల వారీగా తమ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదు అయిందన్నది పరిశీలిస్తున్నారు.

గతంకన్నా ఎక్కువే ...

తెలంగాణ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల శాతం పరిశీలిస్తే గతం కన్నా పోలింగ్ శాతం పెరగడం గమనార్హం. గత ఎన్నికల్లో 69 శాతం నమోదు అయితే ఈసారి 73. 20 శాతానికి పెరిగింది. తీవ్ర ఉద్యమ వేడి నడిచిన రోజుల్లో 69 శాతం స్థాయిలో పోలింగ్ జరిగితే అంతకుమించి 2018 లో తాజాగా నమోదు కావడం ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న లెక్కల్లో తలమునకలై వున్నారు రాజకీయ పండితులు. సాధారణంగా అత్యధిక పోలింగ్ జరిగితే అధికారపార్టీకి నష్టమని పోలింగ్ శాతం తగ్గితే అధికారపార్టీకి లాభమని ప్రచారంలో వున్న నానుడి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఫైట్ హోరా హోరీ సాగిందన్నది ఇప్పటివరకు సర్వేల అంచనా. ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారిక లెక్కలు విడుదలైన నేపథ్యంలో ఫలితాలపై అంచనాలు ఎవరికీ వారే లెక్కిస్తూ గెలుపుపై పైకి ధీమా వ్యక్తం చేస్తూ లోలోపల మాత్రం తీవ్ర టెన్షన్ పడుతున్నారు

Similar News