ఏపీ నేతలకు బీపీ తప్పదా?

Update: 2018-12-08 00:30 GMT

తెలంగాణ ఎన్నికలు ఏపీలో నేతలకు బిపి పెంచుతుంది. పోలింగ్ సరళి ని క్షణ కణం గమనిస్తూ రాజకీయ పార్టీలు పరిస్థితి ని అంచనా వేస్తున్నాయి. పోలింగ్ శాతం అధికం అయితే అధికార పార్టీకి దెబ్బేనని అదే తక్కువ స్థాయిలో నమోదు అయితే తిరిగి గులాబీ పార్టీ జండా ఎగురవేస్తుందనే పాత అంచనాలని వేస్తున్నారు నేతలు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎపి పై అధికంగా పడే అవకాశం వున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పోల్ విశ్లేషణలపైనే దృష్టిపెట్టాయి. ఈనెల 11 వరకు బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ అయ్యే సీన్ లేకపోవడంతో ఎవరి అంచనాలతో వారు లెక్కలు కట్టేస్తున్నారు.

ఎవరు వస్తే ఏం జరుగుతుంది ...?

తెలంగాణాలో టీఆర్ఎస్ తిరిగి అధికారం చేజిక్కించుకుంటే ఏపీలో వైసిపి, జనసేన ల జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అదే మహాకూటమి అధికారాన్ని హస్త గతం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఒకే అభివృద్ధి అనే నినాదంతో తెలుగుదేశం దూసుకువెళ్ళే ఛాన్స్ లు వుంటాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు తమ రాష్ట్రంలో టిడిపి చక్రం తిప్పుతుందని తాము ఎపి రాజకీయాల్లో వేలు పెట్టక తప్పదని ఇప్పటికే కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓటమే టార్గెట్ గా భవిష్యత్తులో టీఆర్ఎస్ అడుగులు అటు తెలంగాణ ఇటు ఎపి లో ఖాయమన్నది తేలిపోతుంది. దీన్ని చాణక్య రాజకీయాల్లో ఆరితేరిన బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

టెలికాన్ఫరెన్స్ ద్వారా....

పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అభ్యర్థులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. పోలింగ్ సరళి, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై విశ్లేషించారు. ప్రధానంగా కూకటపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరును ఆయన అక్కడ స్థానిక నేతలను అడిగితెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 13 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. తెలంగాణాలో కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో వైసిపి, జనసేన కలిసే ఎన్నికలకు వెళతాయా అన్న మీమాంసకు డిసెంబర్ 11 టి ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పనున్నాయి

Similar News