యువ ఎంపీల‌పై బాధ్య‌త పెట్టిన చంద్ర‌బాబు

Update: 2018-07-19 14:00 GMT

అవిశ్వాస తీర్మానం నెగ్గే అవ‌కాశం లేకున్నా తీర్మానంపై జ‌రిగే చ‌ర్చ‌ను పూర్తిగా వినియోగించుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం, విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్రం వైఖ‌రి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను కేటాయించ‌క‌పోవ‌డం, ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌క‌పోవ‌డం వంటి అన్ని విష‌యాల‌నూ పార్ల‌మెంటు వేదిక‌గా గ‌ట్టిగా లేవ‌నెత్తాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. సుమారు ఏడు గంట‌ల పాటు జ‌ర‌గ‌నున్న చ‌ర్చ‌లో సంఖ్యాప‌రంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి 15 నిమిషాలు మాట్లాడే అవ‌కాశం వ‌స్తుంద‌ని తెలుస్తోంది. అయితే, స్పీక‌ర్‌ను అద‌న‌పు స‌మ‌యం కేటాయించాల‌ని కోరాల‌ని నిర్ణ‌యించారు.

అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌ర‌నే...

అవిశ్వాసంపై చ‌ర్చ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎంపీల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ పార్ల‌మెంట్ లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై సూచ‌న‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన కేశినేని నాని చ‌ర్చ‌లో మాట్లాడాల్సి ఉన్నా, ఆ అవ‌కాశాన్ని యువ ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్మోహ‌న్ నాయుడుపై పెట్టింది ఆ పార్టీ. గ‌త స‌మావేశాల్లో రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగం ఆక‌ట్టుకుంది. ఆయ‌న సూటిగా మాట్లాడి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. దీంతో మ‌ళ్లీ మాట్లాడే అవ‌కాశం ఆయ‌న‌కే ఇచ్చారు చంద్ర‌బాబు నాయుడు. ఇక దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు, ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పై మ‌రో యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడ‌నున్నారు. వీరిద్ద‌రూ ఇంగ్లీష్ లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌ర‌నే ఉద్దేశ్యంతో వీరిపైనే ఈ బాధ్య‌త‌ను వీరిద్ద‌రిపై పెట్టారు.

రాష్ట్ర బృందం కూడా...

ఇక ఇత‌ర పార్టీల ఎంపీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో టీడీపీ ఎంపీలు బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌చురించిన బుక్‌లెట్ల‌ను కూడా ఎంపీల‌కు అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎంపీల కోసం ఆయా భాష‌ల్లోనే బుక్‌లెట్ల‌ను రూపొందించారు. ఇక రాష్ట్రానికి చెందిన ప‌లువు అధికారులు, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా ఢిల్లీ వెళ్లి ఎంపీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఎంపీల‌కు కావాల్సిన స‌మాచారాన్ని వారు అందిస్తున్నారు. మ‌రోవైపు తెలంగాణ టీడీపీ నేత‌లు సైతం ఢిల్లీ బాట ప‌డుతున్నారు. తెలంగాణ‌కు కూడా ఏ ఒక్క విభ‌జ‌న హామీ అమ‌లు కాలేద‌ని, కావున అవిశ్వాసానికి తెలంగాణ ఎంపీలు మ‌ద్ద‌తివ్వాల‌ని వారు కోరనున్నారు.

Similar News