బిజెపి పంటికింద రాయి...!

Update: 2018-06-07 17:30 GMT

కాంగ్రెస్ కు శత్రువు, మిత్రుడు ఆ పార్టీ వారే అంటారు. అలానే తయారైంది కమలం పార్టీ పరిస్థితి. ప్రత్యర్థి పార్టీ విమర్శించేలోగానే సొంత పార్టీ వారే ఏకి పారేయడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కి సొంత పార్టీ నేతల నుంచే అక్షింతలు వేయించుకునే సంస్కృతి పెరిగి పెద్దది అవుతుంది. ఇప్పటికే యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా వంటివారు పార్టీ పోకడలపై యుద్ధం ప్రకటించారు. విభిన్న మనస్కుడు సుబ్రమణ్య స్వామి వీరి బాటలో పయనిస్తున్నారు. ఇప్పుడు పార్టీకి వీరందరూ చుక్కలు చూపిస్తున్నారు. సొంత పార్టీ నేతలను ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక కేంద్రం లోని ప్రభుత్వ, పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

కాంగ్రెస్, బిజెపి అన్నదమ్ములే ...

ప్రస్తుతం సుబ్రమణ్య స్వామి తాజా ట్వీట్ ల వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఎయిర్ సెల్ కుంభ కోణంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ నుంచి తప్పించుకోవడం వెనుక బిజెపి హస్తం ఉంది అన్నది స్వామి అనుమానం. రెండు జాతీయ పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోయి దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాలను మ్యానేజ్ చేశారా అనే డౌట్స్ వ్యక్తం చేశారు స్వామి. వాస్తవానికి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. స్వామి నోట్లో నోరు పెడితే ఏమౌతుందో తెలుసు కనుక ఏ ఒక్కరు స్పందించేందుకు సైతం జంకుతున్నారు. మంగళవారం చిదంబరం అరెస్ట్ తధ్యమని రోజంతా వినిపించిన నేపథ్యంలో ఈనెల 10 వరకు ఈడీ ఆధారాల సమర్పణకు గడువు కోరడం, కోర్ట్ ఇవ్వడం ఇవన్నీ చూసి ఒళ్ళు మండి ట్వీట్స్ తో చెలరేగారు సుబ్రమణ్య స్వామి. ఆయన తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కమలం పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఎదురౌతుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Similar News