కేంద్రంపై అమరావతి కేంద్రంగా నేడు...?

Update: 2018-05-07 04:30 GMT

అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిబంధనలతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం నెలకొంది. గతంలో కేరళలో ఇటువంటి సమావేశమే జరిగింది. ఆ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఎవరూ హాజరుకాలేదు. ఈరోజు తిరిగి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఆర్థిక మంత్రుల భేటీ జరగనుంది.

అన్యాయం జరిగిందంటూ.....

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిషా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరాం వంటి రాష్ట్రాలు 15 ఆర్థిక సంఘం సిఫార్సులతో తీవ్రంగా నష్టపోతాయని ఒక అంచనాకు వచ్చాయి. ఒక్క ఏపీకే దీనివల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మరోసారి సమావేశమై తమ గొంతుకను బలంగా విన్పించాలని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి.

రాష్ట్రపతికి తీర్మానం.....

వాస్తవానికి 1971 జనాభా లెక్కల ప్రకారం పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటే 2011 జనాభాలెక్కలను తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం ఆర్థిక సంఘానికి సిఫార్సు చేయడాన్ని దక్షిణాది రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. దక్షిణాదిలో జనాభా తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని, ఉత్తరాదిలో జనాభా తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వాలు కృషి చేయలేదని వాదిస్తున్నాయి. ఈ మేరకు మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరై తమకు జరుగుతున్న అన్యాయంపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపనున్నారు.

Similar News