సిద్ధూ ఉత్సాహంపై నీళ్లు చల్లిన ఇమ్రాన్

Update: 2018-08-03 10:03 GMT

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్, పాకిస్తాన్ టెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ఎవరెవరిని ఆహ్వానిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, క్రికెట్ ఆడే రోజుల నుంచి ఇమ్రాన్ కు పరిచయం ఉన్న కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవజోత్ సింగ్ సిద్ధూ ను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. పీటీఐ పార్టీ ప్రతినిధులు కూడా ఈ వార్తలను ధృవీకరించారు. అయితే, ఈ వార్త తెలుసుకున్న సిద్ధూ ఉబ్బితబ్బిబయ్యారు.

ఆకాశానికెత్తితే...ఇలా చేశాడేంటీ..?

ఆయన చత్తీస్ ఘడ్ లో మీడియాతో మాట్లాడుతూ... ఇమ్రాన్ ఖాన్ ను ఆకాశానికెత్తారు. ఆయన గుణవంతుడని, ఎంతో మంచివాడని, ఇలా రకరకాలుగా పొగిడారు. తాను ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ప్రకటించారు. దీనిపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఫైర్ అయిన విషయం పక్కన పెడితే, తాజాగా సిద్ధూకు ఇమ్రాన్ ఖానే షాక్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారాన్ని చాలా సాధారణంగా నిర్వహించాలని, బయటివారు ఎవరినీ ఆహ్వానించవద్దని పీటీఐ పార్టీ నిర్ణయించింది. దీంతో ఎప్పుడెప్పుడు లాహార్ లో అడుగుపెడదామా అనుకుంటున్న సిద్ధూకు ఒకరకంగా షాక్ తగిలినట్లయింది. ఈ అంశంపై ఇంకా సిద్ధూ స్పందించాల్సి ఉంది.

Similar News