శర్మిష్ఠా అనుమానమే నిజమైందే..!

Update: 2018-06-08 10:29 GMT

మాజీ రాష్ట్రపతి, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడం ఎంత చర్చనీయాంశమయిందో తెలిసిందే. గత వారం రోజులుగా జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. తాము తీవ్రంగా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లకపోడం మంచిదని, మరోసారి ఆలోచించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ శ్రేణులు వివిధ రూపాల్లో ప్రణబ్ ను కోరాయి. ముఖ్యంగా ప్రణబ్ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ కూడా ప్రణబ్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఆమె అనుమనించిందే ఇప్పుడు నిజమైంది. కార్యక్రమానికి వెళ్లకముందు శర్మిష్ఠా తన తండ్రిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ‘ మీ ప్రసంగం ఎప్పటికీ గుర్తుండదు, కానీ, మీ ఫోటో, విజువల్స్ మాత్రం ఎప్పటికీ మిగిలి ఉంటాయి. వాటితో అబద్ధపు ప్రచారాలకు దిగుతారు.’ ‘వారి గురించి మీరు ఇవాళ తెలుసుకుంటారు.’ అని ఆమె వ్యాఖ్యానించారు.

చూశారా..అనుకున్నదే అయ్యింది...

అయితే, ఇప్పుడు శర్మిష్ఠా వ్యాఖ్యలే నిజమైనట్లు కనపడుతోంది. ప్రణబ్ నిన్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైనా ఎక్కడా ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా కానీ, సమర్థించినట్లుగా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పెరేడ్ సందర్భంలో స్టేజీపై ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో పాటు ప్రణబ్ ఆశీనులయ్యారు. గౌరవ వందనం సందర్భంగా ప్రణబ్ లేచి నిలపడినా, ఆర్ఎస్ఎస్ సెల్యూట్ మాత్రం చేయలేదు. స్టేజీపై ఉన్న మిగతా వారంతా ఈ సెల్యూట్ చేశారు. కానీ, ఇప్పుడు కొందరు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రణబ్ కూతురు అనుమానమే నిజమైంది. ఈ విషయంపై శర్మిష్ఠా స్పందించింది. నెట్ లో ఫోటో చూసిన ఆమె ‘దీని గురించే నేను భయపడ్డాను, మా నాన్నకు కూడా ఇదే చెప్పాను. ప్రణబ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ట్రిక్స్ విభాగం ఈ పనిచేసింది’ అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఆమె మండిపడ్డారు.

Similar News