తప్పుడు ప్రచారంపై షర్మిళ సంచలన ఆరోపణలు

తనకు, ఓ హీరోకు సంబంధం ఉందంటూ తెలుగుదశం పార్టీ తప్పుడు ప్రచారం చేయిస్తుందని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ ఆరోపించారు. ఈ [more]

Update: 2019-01-14 07:12 GMT

తనకు, ఓ హీరోకు సంబంధం ఉందంటూ తెలుగుదశం పార్టీ తప్పుడు ప్రచారం చేయిస్తుందని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ ఆమె భర్త అనీల్ కుమార్, పార్టీ సీనియర్లతో కలిసి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిళ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు తర్వాత ఆమె మాట్లాడుతూ… ‘‘తనకు, ఓ హీరోకి సంబంధం ఉందని 2014 ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల తర్వాత నేను ఫిర్యాదు చేస్తే కొంతకాలం ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నందున ఈ విష ప్రచారాన్ని మళ్లీ వేగం పెంచారు. నా వ్యక్తిత్వాన్ని కించపరచడమే వారి ఉద్దేశ్యం. చట్ట ప్రకారం ఈ తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తున్న వారిపై, వారి వెనకాల ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఇలాంటి రాతలు కేవలం నాపైనే కాదు.. మహిళలందరిపైనా దాడిగా భావించాలి.’’

మహిళలపై ఇంత చులకనభావనా..?

‘‘స్త్రీల పట్ల ఇంత శాడిజం, చులకనభావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా.? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, మహిళ హక్కులు వంటి పదాలు కాగితాలు, చర్చలకే పరిమితం కావొద్దు. ఇవి వాస్తవ రూపం దాల్చాలంటే మనం గొంతెత్తాలి. వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో ఈ ప్రచారానికి వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను చేసిన ఫిర్యాదుకు మద్దతు తెలపాల్సిందిగా ప్రజాస్వామ్య వాదులను, నైతికత ఉన్న వారిని, జర్నలిస్టులు, మహిళలను కోరుతున్నాను. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు, చేయిస్తున్న వారు కాకుండా నేను దోషి లాగా నిలబడి నా వాదన వినిపించుకోవాల్సిన పరిస్థితి రావడం నాకే కాకుండా మహిళలు అందరికీ అవమానం.’’

ప్రమాణం చెసి చెబుతున్నాను…

‘‘నేను ఇప్పుడు మాట్లాడకపోతే తప్పుడు ప్రచారమే నిజమని కొంతమందైనా నమ్మే ప్రమాదం ఉంది. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు. కానీ, ఈ రోజు నా గౌరవాన్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరి ముందుకు వచ్చి చెబుతున్నాను. ఏ హీరోతో నాకు సంబంధం ఉందని చెబుతున్నారో ఆ వ్యక్తిని నేను ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఈ విషయాన్ని నా పిల్లల మీద ప్రమాదం చేసి చెబుతున్నాను. తప్పుడు ప్రచారాన్ని పుట్టిస్తున్న వారు వారి ప్రచారమే నిజమని ప్రమాణం చేసి చెప్పగలరా.? రుజువులు, ఆధారాలు చూపించగలరా.? పుకార్లు పుట్టించి, వ్యక్తిత్వాన్ని కించపరచడం దుర్మార్గం కాదా.? నన్ను ప్రేమించే భర్త, నా మీద ఆధారపడే పిల్లలు, ప్రేమించే కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ ఈ ప్రచారం బాధిస్తోంది.’’

సిగ్గనిపించడం లేదా..?

‘‘పుకార్లు పుట్టించి పైశాచిక ఆనందం పొందే వారికి, వారి వెనకాల ఉన్నవారికి సిగ్గనిపించడం లేదా.? తెలుగుదేశం పార్టీ ఈ తప్పుడు ప్రచారం వెనుక ఉందని నేను ఆరోపిస్తున్నాను. ఆ పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్తేమీ కాదు. మా తండ్రి ఫ్యాక్షనిస్టు అని పుకార్లు పుట్టించింది ఆ పార్టీ. తర్వాత ఆయన సీఎం అయ్యాక ఎంత మంచివారో ప్రజలందరూ చూశారు. జగనన్న గర్విష్టి, కోపిష్ఠి అనే పుకార్లను కూడా టీడీపీ పుట్టించింది. కానీ, ఆయన ఎంత సౌమ్యుడో పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పైనా సరే నిజం అని చిత్రీకరించడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతా.? తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్దపెద్ద డైలాగులు చెప్పే టీడీపీ వారు మహిళలకు ఆత్మగౌరవం, కుటుంబగౌరవం ఉందో లేదో చెప్పాలి. కేవలం చంద్రబాబు కుటుంబంలోని ఆడవారికే ఆత్మగౌరవం ఉంటుందా? ఇలా తప్పుడు పుకార్లు పుట్టించాలంటే మేము పుట్టించలేమా.? కానీ నాకు, మా అన్నకు విలువలు, నైతికత, మంచితనం ఉన్నాయి కనుక, మా తండ్రి ధర్మంగా పోరాడే గుణం నేర్పించారు గనుక మేము తప్పుడు ప్రచారం చేయం. మహిళల ఆత్మగౌరవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ పుకార్ల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం.’’ అంటూ షర్మిళ భావోద్వేగంతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేకే హైదరాబాద్ లో ఫిర్యాదు చేశామని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News