ప్ర‌ధానికి రాహుల్ ఆలింగనం...షాకైన మోదీ

Update: 2018-07-20 09:13 GMT

అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా లోక్ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా విన్నాన‌న్న ఆయ‌న 21వ శ‌తాబ్ద‌పు రాజ‌కీయ ఆయుధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాధిత రాష్ట్ర‌మ‌ని అన్నారు. మొదీ పాల‌న‌లో దేశ‌ప్ర‌జ‌లంతా బాధితులుగా మిగిలిపోయార‌న్నారు. దేశ ప్ర‌జ‌లంద‌రి బ్యాంక్ అకౌంట్ల‌లో రూ.15 ల‌క్ష‌లు వేస్తాన‌న‌డం మోడీ మొద‌టి గార‌డి అని, దేశ యువ‌త‌కు రెండు కోట్ల ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని రెండో గార‌డి చెప్పార‌ని విమ‌ర్శించారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీలో చేర్చాల‌ని తాము ప్ర‌తిపాదించామ‌ని, ఒకే శ్లాబులో జీఎస్టీని తీసుకురావాల‌ని చూశామ‌ని, కానీ బీజేపీ ఐదు శ్లాబుల్లో జీఎస్టీ తెచ్చింద‌న్నారు. రాఫెల్ విమానాల కొనుగోళ్లలో అవినీతి జ‌రిగింద‌ని, మాయ‌చేసి రాఫెల్ కొనుగోళ్ల విలువ‌ను రూ.16 వేల కోట్ల‌కు పెంచార‌ని, అడిగితే ఫ్రాన్స్‌తో ర‌హ‌స్య ఒప్పందం ఉందంటున్నార‌ని ఆరోపించారు. కానీ, అటువంటి ర‌హ‌స్య ఒప్పందం ఏమీ లేద‌ని ఫ్రాన్స్ అధ్య‌క్షుడు స్వ‌యంగా త‌న‌తో చెప్పార‌ని పేర్కొన్నారు.

నాది కాంగ్రెస్‌...మీపై నాకు కోపం లేదు

దేశానికి సేవ‌కుడిగా ఉంటాన్న ప్ర‌ధాని అమిత్ షా కుమారుడి అవినీతిపై మాత్రం స్పందించ‌డం లేద‌న్నారు. కేవ‌లం 20 మంది బ‌డా వ్యాపారుల గురించే మోదీ ప‌నిచేస్తున్నార‌న్నారు. త‌న మాట‌ల‌కు ప్ర‌ధాని మోదీ బ‌య‌ట న‌వ్వుతున్న లోప‌ల మాత్రం ఆందోళ‌న చెందుతున్నార‌ని, త‌న క‌ళ్ల‌లోకి సూటిగా చూడ‌లేక‌పోతున్నార‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల‌కు దేశంలో ర‌క్ష‌ణ లేద‌ని గ్లోబ‌ల్ స‌ర్వే ఆన్ ఉమెన్ వెల్ల‌డించినా మోదీ నోటి వెంట ఒక్క మాట కూడా రావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. త‌న‌ను బీజేపీ నేత‌లు ప‌ప్పు అని, హేళ‌న‌తో, కోపంతో చూస్తున్నార‌ని, కానీ, త‌న‌కు మాత్రం బీజేపీ నేత‌ల‌పై కోపం లేద‌ని,ఎందుకంటే త‌న‌ది కాంగ్రెస్ పార్టీ అన్నారు. త‌న‌లో కోపం ఉండ‌ద‌ని, ప్రేమ మాత్రమే ఉంటుంద‌న్న రాహుల్ నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌ద్ద‌కు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగం చేసుకున్నారు. దీంతో ప్ర‌ధాని ఒక్క‌సారిగా అవాక్కయ్యారు. వెంట‌నే తేరుకుని మ‌ళ్లీ పిలిచి చెవిలో ఏదో చెప్పి న‌వ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

 

Similar News