మహిళా సంఘాలతో రాహుల్ ...ఇలా...!

Update: 2018-08-13 11:38 GMT

రాష్ట్రంలో, దేశంలో మహిళల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శంషాబాద్ లో ఆయన మహిళా స్వయం సహాయక సంఘాల వారితో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ మహిళా సంఘాల ప్రభుత్వంలా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని, ఒక్క కుటుంబం మాత్రమే లాభపడుతుందని ఆయన కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు.

రాహుల్ గాంధీ ప్రసంగంలోని ముఖ్యం అంశాలు ఆయన మాటల్లోనే...

- రెండేళ్లుగా ఎన్డీఏ సర్కారు పారిశ్రామికవేత్తలకు రెండున్నర లక్షల కోట్ల రూపాయల రుణం మాఫీ చేసింది.

- మోదీ సర్కారులో పారిశ్రామికవేత్తలకు మాత్రమే రుణం మాఫీ అవుతుంది. మహిళలకు, రైతులకు రుణం మాఫీ కాదు.

- తెలంగాణలో కాంగ్రెస్ అధికరంలోకి వస్తే డ్వాక్రా సంఘాల వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుంది. అభయహస్తం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం.

- దేశం ముందుకుపోవాలంటే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ముందుకుపోవాలి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది.

- చిన్నవ్యాపారులకు బ్యాంకు లోన్లు అవసరం. బ్యాంకు లోన్లు ఇస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

- కానీ తెలంగాణ, ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే లోన్లు ఇస్తున్నారు. చిన్న పారిశ్రామికవేత్తలకు లోన్లు ఇవ్వడం లేదు.

- కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు, మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం.

- కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసింది. దేశం మొత్తం మోదీ 10 వేల కోట్ల మద్దతు ధర పెంచితే, కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలోనే మూడు రెట్ల రుణాలు రైతులకు మాఫీ చేసింది.

- నోట్ల రద్దు జరిగినప్పుడు ఈ దేశంలో పేదలే తప్ప ధనవంతులు ఏ బ్యాంకు ముందైనా నిలబడటం చూశారా..? బ్యాంకులు వెనక తలుపు నుంచి ధనవంతులకు వారి పైసలు వారికి ఇచ్చేశారు.

- మోదీ నల్లదనం మీద పోరాడుతున్నానని చెప్పి, ఇటువంటి చర్యలతో పేదల జేబుల్లో నుంచి డబ్బులు తీసుకుంటున్నారు.

- పదేళ్ల క్రితం మహిళ సంఘాల ఏర్పాటు ఉత్తరప్రదేశ్ లో కుదరదని చాలా మంది చెప్పారు. అప్పడు ఏపీలో మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని తెలిసింది. ఇక్కడి సంఘాల మహిళలను అక్కడికి తీసుకెళ్లి ఎలా ఏర్పాటుచేయాలో చూపించాం. ఇప్పుడు యూపీలో రూ.15 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయంటే తెలంగాణ, ఏపీ మహిళలే కారణం.

- గరీబోళ్ల జేబుల్లో సమ్మును దోచుకునేదే జీఎస్టీ. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దీనిని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. మేము ఒకే స్లాబ్ లో జీఎస్టీ అమలు చేస్తాం. - మహిళా శక్తి దేశ ప్రగతికి ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తుంటే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళలను ఇంటికే అంకితం చేయాలనుకుంటున్నారు.

- తెలంగాణలో ఒక కుటుంబ పరిపాలన జరుగుతోంది. రాష్ట్రంలో ఆ ఒక్క కుటుంబమే బాగుపడుతోంది. రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. రైతులను ఆదుకోవడం లేదు. మహిళల గురించి ఆలోచించడం లేదు. ఇదే పరిస్థితి మోదీ సర్కారులో కూడా ఉంది.

- తెలంగాణలో అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం. మహిళా రక్షణ, సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.

- ‘భేటీ పడావ్ - భేటీ బచావ్’ అని మోదీ అంటున్నారని కానీ, యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యేనే మహిళపై అత్యాచారం చేస్తే మోదీ నోరెత్తడం లేదు.

- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటుచేస్తాం. ప్రతి నిరుపేద ఉన్నత చదువులు చదవాలి.

- మోదీ లాగా ప్రతి పౌరుడికి 15 లక్షలు ఇస్తామనే అబద్ధపు హామీలు ఇవ్వము. చేసేవే చెపుతాము. కర్ణాటకలో రుణమాఫీ చేస్తామని చెప్పాము. చేశాము.

- తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల ప్రభుత్వంగా, అత్యంత బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తుంది.

Similar News