ఈనాటి ఈ బంధం ఏనాటిదో..?

Update: 2018-11-17 10:50 GMT

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అదే కాంగ్రెస్ తో జట్టు కట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యంగా భావించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇందుకోసం చొరవ తీసుకుని ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిసి చర్చించారు. అయితే, అంతకుముందే తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ తో టీడీపీ కలవాలని నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికలతో పాటు రానున్న పార్లమెంటు ఎన్నికలు, ఏపీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. అయితే, వీరికి తొలి పరీక్షగా తెలంగాణ ఎన్నికలు నిలవనున్నాయి.

హైదరాబాద్ లో ఉమ్మడి ర్యాలీ

డిసెంబర్ 7న జరుగనున్న తెలంగాణ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఎన్నికలు చాలా కీలకం. ఇక్కడ టీడీపీతో కూడిన మహాకూటమి గెలవకపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లోనూ పడుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో ప్రచారపర్వంలోకి దిగాలని భావిస్తున్నారు. అంతేకాకుండా నిన్నటివరకు బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో వేదిక పంచుకోనున్నారు. రెండు పార్టీల బంధం మరింత దృడంగా చేసుకోవడంతో పాటు తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నెల చివరి వారంలో హైదరబాద్ లో ఈ చారిత్రక మహా ఘట్టం జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ర్యాలీకి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా దూరంగా ఉన్న రెండు పార్టీల అధినేత ఒక్కచోట చేరితే ఎప్పుడెప్పుడు చూస్తామా అని రెండు పార్టీల కలయికను ఇష్టపడుతున్న కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

Similar News