ప్రధాన మంత్రితో కేటీఆర్ భేటీ ఇందుకే...

Update: 2018-06-27 08:07 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధానిని కలిశారు. ముఖ్యంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ కి ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో సహకరించాలని కేసీఆర్ ఆయనను కోరారు. వీటిపై తమకు మరింత సమాచారం కావాలని ప్రధాని సూచనల మేరకు ఆయా శాఖాలకు మంత్రిగా ఉన్న కేటీఆర్ బుధవారం ప్రధానిని కలిసి పూర్తి సమాచారాన్ని అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ...బయ్యారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత ఉక్కు కర్మాగారం నిర్మించాలని, హైదరాబాద్ లో ఐటీఐఆర్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు కావాల్సిన మౌళిక వసతుల కల్పనకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఐటీలో తెలంగాణ వృద్ధి చెందుతున్న విధానం, ఎలా ముందుకుపోతోందో చెప్పినట్లు ప్రధానికి వివరించినట్లు చెప్పారు. కేంద్రం ఇంకా సహకారం ఇస్తే తెలంగాణకు మరింత మేలు జరుగుతుందని వివరించానన్నారు.

ప్రైవేటుకే రాయితీలు ఇస్తున్నాం...

ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన ప్రాంతంలో 10 నుంచి 15 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చత్తీస్ గడ్ బలోడ్ జిల్లా నుంచి బయ్యారానికి రైలు లైన్, పైప్ లైన్ ఏర్పాటు కోసం రాష్ట్ర తరుపున సగం ఖర్చు భరిస్తామని, సింగరేణి, టీస్ఎండీసీ వంటి సంస్థల ద్వారా సహకరిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ప్రైవేటు రంగంలోని వారికే అనేక రాయితీలు ఇస్తున్నామని, అటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే రాష్ట్రం తరుపున ఇంకా ఎక్కువే రాయితీలు ఇస్తామని తెలిపారు.

Similar News