"పవన్" పాలిటిక్స్ కు గండికొట్టారా ...!!

Update: 2018-12-28 02:30 GMT

కొద్ది మందికే తెలిసిన ఒక రహస్యం అది. వచ్చే ఎన్నికల తరువాతే బయటకు రావలిసిన విషయం. కానీ ముందే తన అభిమానులకు విప్పేసి తన బోళాతనాన్ని బయటపెట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. డివివి బ్యానర్ పై ఈ సంక్రాంతి స్పెషల్ చిత్రంగా రానున్న వినయ విధేయ రామ ప్రీరిలీజ్ కార్యక్రమం లో చిరంజీవి కడుపులో పెట్టుకోవాలిసిన విషయాన్నీ ఓపెన్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరంజీవి చెప్పిన విషయం రాజకీయంగా పవన్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న చర్చకు తెరలేచేలా తన ప్రమేయం లేకుండా మెగాస్టార్ వ్యాఖ్యలు అనుకోకుండా చేయడం విశేషం.

డివివి బ్యానర్ పై ...

ఇంతకీ చిరంజీవి చెప్పిన ఆసక్తికర సంచలన అంశం ఏమిటి అంటే ? పవన్ కళ్యాణ్ తో కలిసి త్వరలో ఒక చిత్రంలో నటించనుండటం. దీనికి త్రివిక్రం కథను సమకూర్చి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతగా డివివి దానయ్యను డిసైడ్ చేసేసారు మెగాస్టార్. దీనికి డిఎస్పీ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఆ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుంది ? ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు చిరంజీవి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రం పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఈ రహస్యం ఇలా భావోద్వేగంతో చెప్పేసినందుకు క్షమించమని త్రివిక్రమ్, దానయ్యలను చిరంజీవి కోరడం విశేషం.

ఇక చిత్రలకు నో అన్న పవన్ ...

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తాను ఇక సినిమాల్లో నటించబోనని గతంలో స్పష్టం చేశారు. ప్రత్యర్ధులు తనను పార్ట్ టైం పొలిటీషియన్ గా అభివర్ణిస్తూ, ఎన్నికల తరువాత రాజకీయాలు క్లోజ్ చేసి సినిమాల్లోకి పోతారని చేసిన విమర్శలకు తిప్పికొట్టేందుకు పవన్ ఈ ప్రకటన చేశారు. గతంలో ఒక ఆడియో కార్యక్రమంలో పవన్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేయగల సమర్ధత ఉన్నవాడిగా అంటూ రెండింటిలో వుండాలని చిరంజీవి ఆకాంక్షించారు. అదే మాటను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సైతం తాజా కార్యక్రమంలో చెప్పడం చూస్తే ఎన్నికల తరువాత పవన్ కొన్ని ఎంపిక చేసిన చిత్రాల్లో నటించడం ఖాయమన్న సంకేతాలు అభిమానులకు మాత్రం పండగ తీసుకువచ్చింది.

టిడిపి, వైసిపి లకు కొత్త ఆయుధం ...

అన్ని వదులుకుని రాజకీయాల్లో సేవ చేసేందుకు వచ్చానని పవన్ ప్రతి సభలో ప్రకటిస్తున్నారు. ఇకపై జనసేన అధినేతపై ఆయన ప్రత్యర్ధులు ఘాటుగా వ్యాఖ్యలు చేసే ఛాన్స్ అనుకోకుండా మెగాస్టార్ ఇచ్చినట్లు అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో సక్సెస్ అయితే ఒకే విఫలం అయితే మాత్రం ఆయన పార్టీని క్యాడర్ ను వదిలి మరో ఎన్నికలు వచ్చే వరకు స్కూల్ మూసేస్తారన్న ప్రచారాన్ని పవన్ ప్రత్యర్ధులు విస్తృతంగా చేసే అవకాశం ఉంటుందన్నది స్పష్టం అవుతుంది. అయితే అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రెండు రోల్స్ చేయడం తప్పేమి కాదు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు సినిమాలో నటించారు. విపక్ష నేతగా వున్నప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో చివరిసారిగా నటించారు కూడా. దాంతో ప్రత్యర్థుల ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టేందుకు జనసైన్యం సిద్ధంగానే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పవన్ వెండితెరపై పవన్ రీ ఎంట్రీ అన్నయ్యతోనే అన్న సత్యం మెగాస్టార్ నుంచే వెల్లడి కావడం మాత్రం సంచలనంగా మారింది.

Similar News