కాంగ్రెస్ లో కరపత్రాల కలకలం

Update: 2018-04-14 00:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక పంచాయతీ లేనిదే పూట గడవకుండా ఉండనట్లుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై వెలసిన కరపత్రాలు ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. సీనియర్ నేతలపై విడుదలయిన ఈ కరపత్రంపై కాంగ్రెస్ పార్టీలో పెద్దయెత్తున చర్చే నడుస్తుంది. తమను పార్టీలోని కొందరు కావాలని టార్గెట్ చేశారని, అందుకనే ఇటువంటి ప్రచారానికి దిగారంటున్నారు సీనియర్ నేతలు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సీనియర్ నేతలపైన....

ఇంతకీ ఏం జరిగిందంటే.... ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కాని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కొందరు నేతలు పార్టీని పట్టించుకోవడంలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంల లేదు. ఇటువంటి వారు పార్టీలో ఉన్నా ఒకటే...లేకున్నా ఒకటే అన్న నినాదంతో కరపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ తో సొమ్ములు సంపాదించుకుని ఇప్పుడు జల్సాలు చేస్తున్నారు కాని పార్టీకి పైసా కూడా ఉపయోగపడటం లేదన్నది ఆ కరపత్రం సారాంశం. కరపత్రం చివర్లో ‘‘ ఇట్లు జంటనగరాల కార్యకర్తలు’’ అని ఉండటం విశేషం.

అధికారంలో ఉన్నప్పుడు.....

అసలు విషయానికొస్తే మాజీ పార్లమెంటు సభ్యులు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి పేర్లతో ఈ కరపత్రం విడుదలయింది. వీరంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందడమే కాకుండా కావాల్సినంత సంపాదించి ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదని ఆ కరపత్రంలో ఆరోపించారు. సీనియర్ నేత అని చెప్పుకుంటూ సొంత నియోజకవర్గంలో డిపాజిట్ దక్కని మాజీ ఎంపీపై విమర్శలు గుప్పించారు. కనీసం పట్టుమని పదిమందిని కూడా సభలకు తేలని వీళ్లు సీనియర్ నేతలా? అని ఎద్దేవా చేశారు. ఇక మాజీ మంత్రి దానం నాగేందర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. టీడీపీలో ఉంటే కాంగ్రెస్ లో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేయకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మరోమాజి మంత్రినయితే పార్టీని పట్టించుకోకుండా ఫిలింనగర్ క్లబ్ లో పేకాట ఆడుతున్నారంటూ ఫైరయ్యారు. అయితే దీనిపై సీనియర్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరో కావాలని తమమీద కుట్ర పన్నుతున్నారని, పార్టీలోని కొందరి నేతల హస్తం ఉండి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మొత్తం మీద గాంధీభవన్ లో కన్పించిన ఈ కరపత్రాలు ఆ పార్టీలో కలకలం రేపాయి.

Similar News