ఎందుకీ మౌనం ఎన్టీఆరూ..!

Update: 2018-12-03 07:21 GMT

ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ కనబడుతుంది. డిసెంబర్ 7న జరగబోయే తెలంగాణ ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీలు గెలుపు కోసం పాటు పడుతున్నాయి. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తమ గెలుపు కోసం భారీ బహిరంగసభలు, రోడ్ షోలు లతో హడావిడి చేస్తున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు, తెలంగాణలో కూకట్ పల్లి నియోజక వర్గం ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది వ్యవహారం. కూకట్ పల్లి నియోజకవర్గానికి హరికృష్ణ కూతురు సుహాసినిని టీడీపీ రంగంలోకి దిగింది. అయితే సుహాసిని రాజకీయాలు అంతగా తెలియవు. మరి అలాంటప్పుడు ఆమెని ఆమె తమ్ముళ్లు, మావయ్య, బాబాయ్ లు నిలబెట్టాలి.

తమ్ముళ్ల ప్రచారం కోసం ఎదురుచూస్తున్నా...

అయితే చంద్రబాబు సుహాసిని మద్దతుగా రోడ్ షో చేశారు. ఇక బాలయ్య కూడా తాజాగా సుహాసినికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ వేసే వరకు బాలకృష్ణ సుహాసిని వెన్నంటే ఉన్నాడు. ఇకపోతే సుహాసినికి మద్దతుగా ఆమె తమ్ముళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారానికి వస్తారని ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రతి రోజు నిరాశే ఎదురవుతుంది. అక్క ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి అక్కకు మద్దతు తెలిపి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుండి అక్క సుహాసినికి మద్దతుగా ఒక్క మాట కూడా తమ్ముళ్ల నోటి వెంట రాలేదు.

ఎందుకీ మౌనం...

అసలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మౌనం దేనికి సంకేతం ? సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండి ప్రచారానికి రాలేదా ? అక్క కోసం ఒక గంట ప్రచారం చేయలేరా ? అసలెందుకు మౌనం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరి రేపు ఐదో తారీఖుతో ఈ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ లోపు ఎన్టీఆర్ కళ్యణ్ రామ్ లు ఏమైనా కదులుతారా ? లేదంటే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను బ్రతిమాలాలా ? చంద్రబాబు, బాలయ్య మాత్రం తమకెలాంటి సంబంధం లేదు మా పని మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. హరికృష్ణ మరణం అప్పుడు మాత్రం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు మేమున్నాం అన్నారు. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. ఏదైనా ఎన్టీఆర్ మౌనం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు.

Similar News