ఈ ఒక్క ఫోటో పాకిస్థాన్ ని ఏడిపిస్తోంది

Update: 2018-07-13 10:36 GMT

మన పక్క దేశం పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి చెందిన ఒక్క ఫోటో ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఎంతో మంది ప్రజలను బాధపడేలా చేస్తోంది. నవాజ్ షరీష్ పై, అతని పార్టీపై, కుటుంబంపై సానుభూతి పవనాలు వీచేలా చేస్తోంది. లండన్ లో భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై పాకిస్థాన్ సుప్రీంకోర్డు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు శిక్ష, ఎనిమిది మిలయన్ పౌండ్ల జరిమానా విధించింది. ఆయనతో పాటు ఆయన కూతురు మరియం షరీఫ్ కి ఏడేళ్ల జైలు, రెండు మిలియన్ పౌండ్ల జరిమానా విధిస్తూ జులై 6న సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ తీర్పు రావడం పాకిస్థాన్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

మరణానికి దగ్గరలో ఉన్న భార్యను వదిలి

నవాజ్ షరీఫ్ సతీమణి బేగం కల్సూమ్ నవాజ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి కోమాలోకి వెళ్లి నెల రోజులుగా వెంటిలేటర్ పై మరణానికి దగ్గరలో ఉన్నారు. నవాజ్ షరీఫ్, మరియం కూడా ఆసుపత్రిలోనే ఉంటూ ఆమెను చూసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కోర్టు ఈ తీర్పు ఇవ్వడం షరీఫ్ కుటుంబంతో పాటు ప్రజల్లోనూ ఆవేదన వ్యక్తం అవుతోంది. తీర్పును అనుసరించి షరీఫ్, ఆయన కూతురు పాకిస్థాన్ లో విమానం దిగగానే అరెస్ట్ చేస్తామని ఇప్పటే ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. దీంతో జైలు శిక్ష అనుభవించడానికి షరీఫ్, మరియం లండన్ నుంచి పాకిస్థాన్ కి వస్తున్నారు. చివరి క్షణాల్లో ఉన్న భార్యను వదిలిరావాల్సిన పరిస్థితి ఆయనది. దీంతో చివరగా పాకిస్థాన్ బయలుదేరే ముందు షరీఫ్, మరియం వెంటిలేటర్ పై ఉన్న ఆమెకు వీడ్కోలు పలుకుతున్న ఫోటో ఇప్పుడు వేరల్ అయ్యింది. ఈ ఫోటోలో మరియం ఏడుస్తూ నిల్చోగా, షరీఫ్ భార్య తలపై చేయి వేసి దీనంగా ఉన్నారు.

వెల్లువెత్తుతున్న సానుభూతి

ఈ ఫోటోను ఓ పాకిస్థానీ జర్నలిస్టు ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీంతో ఆ దేశంలో వైరల్ గా మారింది. దీనికి తోడు పాకిస్థాన్ బయలుదేరే ముందు లండన్ లో ఏర్పాటుచేసిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ సమావేశంలోనూ నవాజ్ తీవ్ర ఉద్వేగంతో మాట్లాడారు. ‘‘నన్ను జైల్లో వేయండి, ఉరి తీయండి. కానీ, పాకిస్థాన్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు కచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అంటూ ఆ దేశ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము జైలు శిక్ష అనుభవించడానికి వెళుతున్నామని, అయితే, త్యాగం చేయనిదే స్వేచ్ఛా స్వాతంత్రాలు రావని తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు. తన భార్యను వెంటిలేటర్ పై వదిలి వెళ్లడం ఎంతో బాధగా ఉందని, బానిసత్వాన్ని వదిలించడానికి తమ వంతు పాత్ర పోషించడానికి వెళుతున్నామని ఆయన అన్నారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భార్యతో నవాజ్, మరియం దిగిన చివరి ఫోటో, షరీష్ వ్యాఖ్యల పట్ల పాకిస్థాన్ లో విపరీతంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయి. పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన ఫోటోగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ ఈ రెండు అంశాలు అక్కడి రాజకీయాలను మార్చేయబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News