మోదీని మరోసారి...?

Update: 2018-08-04 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీపై వ్యతిరేకతను మరింత క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసిందని చంద్రబాబు మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించారు. పార్లమెంటులో రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి అంశాలను ఇస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించి, తర్వాత సుప్రీంకోర్టులో అఫడవిట్ దానికి వ్యతిరేకంగా దాఖలు చేయాలని తప్పుపడుతున్నారు. తద్వారా మోదీని మరోసారి ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు.

సభాహక్కుల ఉల్లంఘన నోటీసు....

దీంతో కేంద్ర మంత్రులపై తెలుగుదేశం పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి మరోసారి విభజన హామీల అంశాన్ని దేశ వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటోంది. ఇప్పటికే పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు విభజన హామీలపై పోరాడుతున్నారు. ప్రతిరోజు సభలోనూ, బయటా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని రకాలుగా......

దీనికితోడుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలసి విభజన హామీల అంశాలను అమలు చేయకపోవడాన్ని వారి దృష్టికి తీసుకు వస్తున్నారు. దీనివల్ల మోడీ సర్కార్ మోసాన్ని ఉన్నతస్థాయిలో బయటపెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా ఉంది. ఇప్పటికే అవిశ్వాసం తీర్మానం మోడీ సర్కార్ పైన పెట్టి, వీగిపోయినా దేశ వ్యాప్తంగా చర్చను తీసుకురాగలిగామని తెలుగుదేశం భావిస్తోంది. వైసీపీ లాగా తాము రాజీనామా చేయకుండా పోరాటం చేయడం వల్ల మైలేజీ వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు.

వైసీపీ, జనసేనలను కూడా.....

ఈ వేడిని ఇలాగే కొనసాగించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇప్పటికే గ్రామదర్శిని పేరుతో వివిధ జిల్లాలను పర్యటిస్తూ మోడీ మోసాలను ఎండగడుతున్నారు. మరోవైపు ధర్మపోరాట సభలను కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నింటితో ఒకవైపు మోదీ నియంత పాలనను తప్పుపడుతూనే, మరోవైపు తమకు ప్రధాన శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలను కూడా చంద్రబాబు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆ రెండు బీజేపీకి తోక పార్టీలేనన్న విషయాన్ని ప్రతి సభలో చెబుతున్నారు. ఇక మరోసారి మోడీ సర్కార్ లోని కేంద్ర మంత్రులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి దేశవ్యాప్తంగా చర్చ జరపాలని నిర్ణయించారు.

Similar News