కిరణ్ చేరిక ఖాయం..?

Update: 2018-06-27 07:38 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగానే కనపడుతోంది. ఈ మేరకు బుధవారం ఆయనతో ఆ పార్టీ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ఆయనను కలిశారు. ఇవాళ అధిష్ఠానానికి దగ్గరివ వ్యక్తిగా పేరున్న సుబ్బిరామిరెడ్డి సమావేశమయ్యారు. సుమారు 35 నిమిషాల పాటు వారి సమావేశం జరిగింది.

త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారు...

కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని, ఆయన చేరిక దాదాపు ఖరారైందని సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కిరణ్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే కిరణ్ అధిష్ఠానాన్ని కలుస్తారని, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు పార్టీలో జాతీయ స్థాయిలో సముచిత స్థానం ఉంటుందని, పార్టీ జెనరల్ సెక్రెటరీ వంటి పదవులకు ఆయన అర్హుడని తెలిపారు. అధిష్ఠానం సందేశాన్ని ఆయనకు తెలిపానని తెలిపారు.

Similar News