వెంకయ్యపై ఫిర్యాదు..! ఎవరికి..?

Update: 2018-08-02 07:24 GMT

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై విపక్ష పార్టీలు వినూత్న నిరసనకు సిద్ధమవుతున్నాయి. ఆయన ఏకపక్షంగా రాజ్యసభ నడిపిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. ఈ ఫిర్యాదు చేసేది మరెవరికో కాదు.. ఆయనకే. రాజ్యసభలో విపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని, బీజేపీకి అనుకూలంగా సభ నడుస్తోందనేది విపక్షాల వాదన. దీంతో ఆ పార్టీలు ఆయనకు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, ఎన్సీపీ ఇందులో భాగమవుతున్నాయి. మరికొన్ని పార్టీల నేతలు కూడా తమతో చేరుతాయని ఆశిస్తున్నారు. మొదట వెంకయ్య వైఖరిపై ఏవిధంగా నిరసన తెలపాలో దీర్ఘంగా ఆలోచన చేసిన విపక్ష పార్టీలు చివరకు ఆయనపై ఆయనకే ఫిర్యాదు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

మూడు అంశాలపై ఫిర్యాదు...

అస్సాంలో ఎన్ఆర్సీ అంశంపై రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ... విపక్ష పార్టీలపై మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు సభలో లేవనెత్తారు. దీంతో విపక్ష సభ్యులు అమిత్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభ వాయిదా వేసిన వెంకయ్య మరునాడు సమాధానం చెప్పేందుకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కి అవకాశం ఇవ్వకుండా తిరిగి మళ్లీ అమిత్ షా కే ఇచ్చారు. ఇది విపక్షాల నిరసనకు కారణమైంది. ఇక, రాజ్యసభ టీవీలో ప్రతిపక్షాలను తక్కువ చేస్తూ అధికార పార్టీ విధానాలకు అనుగునంగా నడుస్తుందనేది మరో ఆరోపణ. దీనికి తోడు నోట్ల రద్దు సమయంలో అమిత్ షా బోర్డు మెంబర్ గా ఉన్న ఓ కోఆపరేటీవ్ బ్యాంక్ లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని విపక్ష సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలు రాజ్యసభ వెబ్ సైట్ నుంచి మాయమయ్యాయి. దీంతో ఈ మూడు అంశాలపై ఆగ్రహంగా ఉన్న విపక్ష సభ్యులు ఫిర్యాదు ద్వారా తమ నిరసన తెలపాలని భావిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితిని వెంకయ్య నాయుడు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

Similar News