తిరుపతిలో మోత్కుపల్లి హల్ చల్

Update: 2018-07-11 08:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తనను పార్టీలో నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ ఆయన ధర్మ పోరాటం పేరుతో తిరుపతికి వెళ్లారు. ఈ సందర్భంగా మోత్కుపల్లికి ఆయన అనుచరులు, మోత్కుపల్లి మిత్రమండలి సభ్యులు, పలు దళిత సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనకు మద్దతు తెలిపారు. తిరుపతిలో మోత్కుపల్లికి మద్దతుగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అనంతరం మోత్కుపల్లి తిరుపతిలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అలిపిరి నుండి కాలినడకన తిరుమల బయలుదేరారు.

పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు...

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడును ఓడించాలని స్వామివారిని వేడుకుంటానని పేర్కొన్నారు. బతికినన్ని రోజులు తనకు రుణపడి ఉంటానని చంద్రబాబు చెప్పారని, ఆయన ఒక నమ్మకద్రోహి అని, ఒక్కో సీటును రూ.వంద కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. పదవులు ఇస్తానని ప్రలోభపెట్టడంలో చంద్రబాబు పీహెచ్ డీ చేశారని ఎద్దేవా చేశారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడిని మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు. ఎదురుతిరిగిన వారిని చంద్రబాబు బెదిరిస్తారని, లేకపోతే అంతమొందించే వరకూ నిద్రపోడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కూడా పోలీసుల ద్వారా బెదిరించారని, తాను ఏమాత్రం భయపడనని స్పష్టం చేశారు.

Similar News