మోదీకి పొంచి ఉన్న ముప్పు

Update: 2018-06-26 08:24 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రమాదం పొంచి ఉందని భద్రతా విభాగాలు హెచ్చరించాయి. ఈ మేరకు మోదీ భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రాష్ట్రాలకు పలు సూచనలు చేశాయి. మోదీ పర్యటనల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను రాష్ట్రాలకు అందజేశాయి. ప్రధాని పర్యటనల్లో ఆయన భద్రతా సిబ్బంది అనుమతి లేకుండా ఎవరూ మోదీకి దగ్గరగా రావొద్దని, మంత్రులు, అధికారులైనా ఇది పాటించాల్సిందేనని స్పష్టం చేశాయి. అంతేకాదు రానున్న ఎన్నికల నేపథ్యంలో మోదీ బీజేపీ తరుపున విస్తృతంగా ప్రచారం చేయనున్నందున రోడ్ షోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువగా రోడ్ షోలు నిర్వహించవద్దని, ప్రధాని పర్యటన ప్రణాళకను, రూట్లను బహిర్గతం చేయవద్దని సూచించాయి.

మావోయిస్టులకూ టార్గెట్ గా..?

ఇప్పటికే ఉగ్రవాదులకు ప్రధాని మోదీ టార్గట్ గా మారారని పలుమార్లు వెల్లడైంది. ఇక తాజాగా మహారాష్ట్రలోని పూణే పోలీసులు.. ప్రధాని మోదీకి ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. భీమా-కోరేగావ్ ఘటనకు సంబంధించి పుణే పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తుల వద్ద లభ్యమైన లేఖల ప్రకారం మావోయిస్టులు కూడా మోదీని టార్గెట్ చేసుకున్నారని వెల్లడైంది. రాజీవ్ గాంధీ తరహాలో ఆత్మహుతి దాడి జరిగే ప్రమాదం ఉందని పోలీసులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే జరుగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ ఎన్నికల్లోనూ మోదీ విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఆ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ ఆయన పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని భద్రతకు సంబంధించి భద్రతా విభాగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

Similar News