లగడపాటి మళ్లీ లైవ్ లోకి వచ్చారు

Update: 2018-12-05 06:23 GMT

తనకు ఏ పార్టీతో, ఏ నాయకితో సంబంధం లేదని, వాస్తవంగా సర్వే చేశానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ కి నవంబర్ 20న మెస్సేజ్ చేసింది వాస్తవమేనని, అయితే, అప్పటి పరిస్థితి ప్రకారం టీఆర్ఎస్ కి ఆధిక్యత ఉందని, ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపారు. ప్రభుత్వానికి ఎప్పుడేనా ఆధిక్యత ఎక్కువ ఉండాలని, పోటాపోటీ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిస్థితులు మారుతాయన్నారు. తాజా పరిస్థితి ప్రకారం వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ కు ఆధిక్యత కనిపిస్తోందని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బెల్ట్ మొత్తం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్ల ప్రభావం టీఆర్ఎస్ పై పడుతోందన్నారు. కాంగ్రెస్ హామీలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్లాయన్నారు.

కేటీఆర్ నన్ను కలిశారు...

తమ బంధువుల ఇంట్లో కేటీఆర్ తనను కలిశారని, అప్పుడు పలు సూచనలు చేశానని వివరించారు. చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్ కి చెప్పానని, అయినా వినకపోవడంతో టీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందన్నారు. చంద్రబాబుకు ఉన్న 20 శాతం ఓట్లు మొదట టీఆర్ఎస్ కి వెళ్లినా ఇప్పుడు పోటాపోటీ ఉన్నందున ఆ ఓట్లన్నీ మళ్లీ ప్రజాకూటమి వైపు వచ్చేశాయని తెలిపారు. కొందరు అభ్యర్థులను సైతం మార్చాలని కేటీఆర్ కి చెప్పానని, పోటాపోటీ ఉన్నందున అభ్యర్థులపై వ్యతిరేకత ప్రభావం చూపుతుందన్నారు. తన నిజాయితీని శంకించడం, చిలుక జోస్యం అని చెప్పినందునే ఈ వివరాలు అన్ని చేప్పానన్నారు. కేటీఆర్ పోస్ట్ చేసిన వాట్సాప్ మెసేజ్ లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Similar News