బీజేపీకి షాక్...కలిసిపోయిన అన్నదమ్ములు

Update: 2018-05-16 07:30 GMT

కర్ణాటకలో జేడీఎస్ లో చీలక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకోవలన్న బీజేపీ ఆశలపై జేడీఎస్ నీళ్లు చల్లింది. కుమారస్వామికి వ్యతిరేకంగా దేవెగూడ మరో కుమారుడు రేవణ్ణను, తన వర్గం ఎమ్మెల్యేలు 12 మంది తమవైపు ఉన్నారని బీజేపీ ఇవాళ ఉదయం వరకూ ప్రచారం చేస్తూ వచ్చింది. గవర్నర్ ను సైతం కలిసి ఇదే విషయం చెప్పింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా బుధవారం మధ్యాహ్నం జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కుమారస్వామి తన సోదరుడు రేవణ్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో గానీ, పార్టీలో గానీ ఎటువంటి చీలక లేదని, తమంతా ఒకటేనని అన్నదమ్ములిద్దరూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తమకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుతో తామే అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

చీలిక కోసం విశ్వప్రయత్నాలు చేస్తొంది

తమ పార్టీలో చీలిక తేవడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తొందని కుమారస్వామి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ప్రధాని మోడీనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆఫర్ చేసి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ విజయం, మోడీ విజయం కాదన్నారు. మతతత్వ బీజేపీని నిరోధించేందుకు, కర్ణాటక అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.మొత్తం మీద అన్నదమ్ములు విడిపోతారని కొద్దిసేపటి వరకూ హోరెత్తిపోయిన ప్రచారానికి వారు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

Similar News