బ్రేకింగ్ : కండువా కప్పుకున్న మాజీ సీఎం

Update: 2018-07-13 06:56 GMT

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2014కి ముందువరకూ కాంగ్రెస్ తోని ఉండి, నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన కిరణ్ రాష్ట్ర విభజనకు నిరసనగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో నాలుగేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పాత నేతలను మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటోంది.

పార్టీ బలోపేతమే లక్ష్యం...

ఇందులో భాగంగానే ఏపీకి పార్టీ ఇంఛార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తిరిగి చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని భావించిన కాంగ్రెస్ ఊమెన్ చాందీ కిరణ్ తో రాయబారం నడిపారు. మొదట ఆ పార్టీ సీనియర్ నేతలు పళ్లంరాజు, సుబ్బిరామిరెడ్డి కిరణ్ తో భేటీ అయ్యి అధిష్ఠానం ఆహ్వానాన్ని తెలియజేశారు. ఆయన కూడా కొంత ఆసక్తి చూపడంతో ఇంఛార్జి ఊమెన్ చాందీ కూడా ఆయనను కలిశారు. దీంతో ఆయన చేరిక ఖాయమైంది. గురువారం ఉదయం ఢిల్లీలో రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఏపీ బాధ్యతలతో పాటు ఏఐసీసీలో ముఖ్య పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, నేతలు అశోక్ గెహ్లాట్, పళ్లం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Similar News