జల విధ్వంసం ఎందుకు?

Update: 2018-08-17 18:29 GMT

గాడ్స్ ఓన్ కంట్రీ అతలాకుతలం అవుతోంది. గత తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం మునిగిపోతోంది. వరదల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని సుమారు 80 శాతం ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోకి వెళ్లింది. నిన్నటికి ఇవాళటికి మృతుల సంఖ్య రెట్టింపై ఇప్పటివరకు 324 మంది మృత్యువాత పడ్డారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు సైతం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 80 ప్రాజెక్టుల గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. అయితే, మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో కేరళవాసుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.

ఎన్నడూ చూడని విపత్తు....

శతాబ్దకాలంలో ఎప్పుడూ చూడని విపత్తును కేరళవాసులు చూస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదతాకిడికి వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. కేరళ మామూలుగా నష్టపోలేదు. అన్ని రకాలుగా కేరళలో జలవిధ్వంసం జరిగింది. సుప్రీంకోర్టు కూడా కేరళ వరదతాకిడికి విలవిలలాడుతుండటంతో స్పందించాల్సి వచ్చింది. ముళ్లపెరియార్ ఆనకట్టలో నీటిని 139 అడుగులకు తగ్గించేందుకు కృషి చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.

సుప్రీంకోర్టు సీరియస్....

ముళ్లపెరియార్ డ్యామ్ నీటి మట్టం 142 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే కేరళలో ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచే విషయమై కూడా ఆలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేరళ ఈ వరద తాకిడికి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. గత మే నెల నుంచి ఇప్పటి వరకూ 324 మంది వరదల వల్ల మరణించారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇప్పటికే కేరళలో దాదాపు రెండు లక్షల మందికి పైగానే సహాయ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్.....

కేరళలోని 14 జిల్లాల్లో ఈ వరద ప్రభావం ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వరద తాకిడికి ఎక్కడకికక్కడ విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. దీంతో కేరళలోని 80శాతం ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు నరకయాతన పడుతున్నారు. సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా వాళ్లంతా ఇప్పట్లో తేలుకోలేరన్నది వాస్తవం.పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేరళ పరిస్థితిని స్వయంగా సమీక్షించి, ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కేరళ చేరుకున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

వరద బీభత్సంతో చిన్నాభిన్నమవుతున్న కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుపుతున్నారు. 16 ఆర్మీ, 42 నేవీ, 43 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 4 వేల మందిని నేవీ కాపాడింది. 13 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ విధించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం 1500 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2.23 లక్షల మందికి వాటిల్లో ఆశ్రయం కల్పించారు. కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రధాని మోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఆయన కేరళకు స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తి అండ ఉంటుందని భరోసా ఇచ్చారు. కేరళకు పంజాబ్ ప్రభుత్వం రూ.10 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.వివిధ రాష్ట్రాల నుంచి సాయం అందుతున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తడంతో కేరళ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు.

Similar News