వదల బోమ్మాళీ వదలా అంటున్న చంద్రబాబు

Update: 2018-11-21 08:59 GMT

పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ముందుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

- పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వదల బొమ్మాళి వదలా’ అంటున్నాడు. మరి ఆయనను ఎలా తరిమికొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. నా వరకు నేను ఒక్కసారి తరిమికొట్టాను.

- ముఖ్యమంత్రిగా చంద్రబాబు మహబూబ్ నగర్ ను దత్తత తీసుకున్నా అని చెప్పి తొమ్మిది ఏళ్లలో ఏం చేశాడు. నాలుగేళ్లలో మేము పాలమూరును పచ్చగా మార్చాము. దత్తత పేరుతో చంద్రబాబు పాలమూరు జిల్లాను ముంచాడు.

- పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత ప్రాజెక్టు కడుతుంటే కేంద్రానికి ఉత్తరం రాసి ఆపిన వ్యక్తి చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టు రానియ్యమని చెబుతున్న టీడీపీకి ఓట్లేసేందుకు తెలంగాణ ప్రజలు గొర్రెలా ?

- మహాకూటమి పేరు మీద చంద్రబాబు తెలంగాణలోకి దూరుతున్నాడు. ‘మీ ఇంట్లకే వచ్చి మిమ్మల్ని కొట్టి పొతా అంటుండు.’ మరి చంద్రబాబుకి ఓటేసే పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపుకుందామా అని ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు వచ్చిన రోజు నిలదీయాలి.

- కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా చంద్రబాబును ఎత్తుకుని తీసుకువస్తున్నారు. వారిని కూడా ప్రజలు నిలదీయాలి.

- ఇంకా పోరాటం ఆగిపోలేదు. కొందరు దుర్మార్గులు ఉడుముల్లా చొచ్చి మన ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. పాలమూరు ప్రజలను అమాయకులను చేస్తూ, మీ వెలితోనే మీ కళ్లలో పొడుస్తా అంటున్న చంద్రబాబు కు బుద్ధచెప్పాలి.

- మహాకూటమి కనుక పొరపాటున వస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు.

- రాష్ట్రాభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. మహాకూటమి నేతల మాటలు విని మోసపోతే గోస పడాల్సి వస్తుంది.

Similar News