ముందస్తుకే కేసీఆర్ మొగ్గు..!

Update: 2018-08-24 13:20 GMT

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. పలు దఫాలుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల శంఖారావంగా ప్రగతి నివేదన సభను పెద్ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అదే సభ సాక్షిగా ఆయన ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి చర్చించారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత కాదని చెబుతున్నా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.

ముందస్తు కాదు... కానీ ముందుగా..!

దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిపేందుకు ఇంతకుముందు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోగా తెలంగాణ ప్రభుత్వం మొదట అంగీకరించింది. అంటే ఎన్నికలకు ఎంత త్వరగా వెళ్తే అంత మేలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యవర్గంతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే నిర్ణయాన్ని వారంతా అధినేతకే వదిలేశారు. అయితే, ఇప్పటికే ఎన్నికల ఏడాది ప్రారంభమైందని, గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగితే అవి ముందస్తు ఎన్నికలు అనరు అనేది టీఆర్ఎస్ వాదన. అంటే, ముందస్తు కాకున్నా ఎన్నికలు ముందుగా జరగాలనేది ఆ పార్టీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాలు బలంగా మారకముందే..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇటీవలే రైతులందరికీ ఎకరానికి రూ. నాలుగు వేల చొప్పు రైతుబందు పథకంలో భాగంగా అందించింది. తాజాగా రైతుబీమ, కంటి వెలుగు వంటి పథకాలను సైతం ప్రారంభించింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాల్లో బాగా నానుతున్నాయి. పెద్దఎత్తున ప్రజలు వీటి ద్వారా లబ్ధి పొందుతున్నారు. పైగా ప్రతిపక్షాలు ఇంకా ఎన్నికలకు సిద్ధంగా లేవు. పొత్తులపై ఏమాత్రం క్లారిటీ లేదు. ఇదే సమయంలో ఒంటరి పోరుతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ ఎప్పుడో నిర్ణయించింది. ప్రతిపక్షాలు ఇంకా సిద్ధం కాకముందే ఎన్నికలకు వెళ్తే గెలుపు పక్కా అని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

సభతోనే శంఖారావం

ఎన్నికలు ఈ ఏడాదిలోనే రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 2న లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. సభలోనే ఆయన ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు మార్గదర్శకం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల వరాలు కూడా కేసీఆర్ ప్రకటిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇమాంలకు రూ.ఐదు వేల గౌరవ వేతనం, వివిధ సామాజికవర్గాలకు భవనాలు, స్థలాలు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యర్థులు ఇంకా ఎన్నికలలకు సిద్ధం కాకముందే ఎన్నికలు తీసుకువచ్చి మళ్లీ విజయం సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ పక్కా స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

Similar News