వైఎస్ తర్వాత కేసీఆర్ ...!!

Update: 2018-12-30 03:30 GMT

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా మలుచుకుని మామ పైనే తిరుగుబాటు చేసి మీడియా సహకారంతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తరువాత పలు పత్రికలు, ఛానెల్స్ ను తన వర్గం వారితో ఏర్పాటు చేయించి బాబు అంటే మీడియా.. మీడియా అంటే బాబు అన్నంతగా మరింత పాపులర్ అయ్యారు. చంద్రబాబు చీమంత చేసింది కొండంతగా ప్రచారం చేసే పరిస్థితి ఉండటంతో ఏపీ లో ఆయన హవాకు ఎదురు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బాబుకు వెన్నెముకగా వుంటూ వస్తున్న మీడియా వైఖరిపై అటాక్ చేశారు కేసీఆర్.

పసుపు మీడియా పై....

చంద్రబాబు మీడియా పోకడలను గతంలో వైఎస్ టార్గెట్ చేసినంతగా ఎవ్వరు చేయలేక పోయేవారు. అసెంబ్లీ సాక్షిగా ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్సాఆర్ నేరుగా బాబుపైనా ఆయన కు సహకరిస్తున్న మీడియా పై విరుచుకుపడేవారు. ఆ తరువాత ఆ స్థాయిలో బాబు అండ్ ఆయన మీడియా పై నేరుగా డేర్ గా విమర్శనాస్త్రాలు సంధించిన వారు లేనేలేరు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేసారు కెసిఆర్. చంద్రబాబు మీడియా పోకడలను తూర్పారబట్టడమే కాక ఏ సందర్భంలో వారు ఎలా వ్యవహరించింది పూస గుచ్చినట్లు చెప్పి టిడిపి మీడియా వలువలు వూడతీశారు గులాబీ బాస్.

కౌంటర్ ఇచ్చినా....

తెలంగాణ సిఎం ఈ స్థాయిలో ఇలా బాబు మీడియా పై దాడికి దిగుతారని నిజానికి టిడిపి శ్రేణులు ఊహించలేదు. దాంతో ప్రతి దాడికి కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి లను రంగంలోకి దించి ఎదో ఒక కౌంటర్ ఇచ్చింది టిడిపి. అయితే వచ్చే ఎన్నికల లోగా కెసిఆర్ చంద్రబాబు పై ఇంకా ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారో అన్న ఆసక్తి ఆందోళన మాత్రం పసుపు శిబిరంలో గుబులు రేపుతోంది.

Similar News