కరుణ అంత్యక్రియలపై వివాదం

Update: 2018-08-08 03:45 GMT

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలపై వివాదం అలుముకుంది. కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో స్థలం కేటాయించాలని డీఎంకే కోరుతోంది. అయితే కోర్టు వివాదాలతో మెరీనా బీచ్ లో స్థలం కేటాయించలేమని అన్నాడీఎంకే ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని, రాజాజీ మార్గ్ లో చేసుకోవాలని సూచించింది.

మద్రాస్ హైకోర్టు తీర్పు కోసం.....

దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే మెరీనా బీచ్ లో సమాధులకు స్థలం ఇవ్వొద్దంటూ గతంలో మద్రాస్ హైకోర్టులో ట్రాఫిక్ రామస్వామి వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రభుత్వం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన వారికే మెరీనా బీచ్ లో సమాధికి స్థలం కేటాయించే సంప్రదాయం ఉందని ప్రభుత్వం తాజాగా పేర్కొంటోంది. దీంతో డీఎంకే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టులో దీనిపై తీర్పు రావాల్సి ఉంది. కరుణ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. ప్రధాని మోదీ కూడా చెన్నైకి వచ్చి కరుణకు నివాళులర్పించనున్నారు. మద్రాస్ హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Similar News