ఇదేం నమ్మకం రేవణ్ణా..?

Update: 2018-07-05 11:00 GMT

ఆయన స్వయంగా మంత్రి...స్వయానా ముఖ్యమంత్రికి అన్న...మాజీ ప్రధాని కుమారుడు...ఇంత పలుకుబడి ఉన్న ఆయన బెంగళూరులో ఉండాలంటే భయపడుతున్నారు. అయితే, ఈ భయానికి కారణం జ్యోతిష్యం కావడం ఇప్పడు చర్చనీయాంశమైంది. అంతేకాదు మూఢనమ్మకాలను నమ్మి నవ్వులపాలవుతున్నారు ఆయన. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు హెచ్.డీ. రేవణ్ణ ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అయితే, తాను బాగా నమ్మే ఓ జ్యోతిష్యుడు బెంగళూరులో నిద్రించవద్దని, నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పాడంట. అంతేకాదు, ప్రభుత్వం కూడా పడిపోతుందని హెచ్చరించారంట.

అవును మరి అసలే తుమ్మతే ఊడిపోయే ముక్కులాగా ఉంది కర్ణాటక ప్రభుత్వం పరిస్థితి. దీంతో రేవణ్ణ జ్యోతిష్యుడి మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతీరోజూ తన స్వంత నియోజకవర్గం హోలెనసిపుర నుంచి రాజధాని బెంగళూరుకి ప్రయాణిస్తున్నారు. రానూపోనూ 340 కి.మీ దూరం. సుమారు ఆరు గంటలకు పైగా ప్రయాణం ప్రతీ రోజూ. అయితే, మంత్రిగా ఉన్న ఆయన కాన్వాయ్, సిబ్బంది ఖర్చులు ప్రభుత్వమే భర్తిస్తోంది. అయితే, సదరు జ్యోతిష్యుడు రేవణ్ణకు ఓ మినాహాయింపు ఇచ్చారంట. ప్రభుత్వ బంగ్లా ఇస్తే బెంగళూరులోనే నిద్రించవచ్చని చెప్పాడంట. అయితే, ప్రభుత్వం ఇంకా ఆయనకు బంగ్లా ఇవ్వలేదు. రేవణ్ణకు ప్రభుత్వం బంగ్లా ఎప్పుడిస్తుందో...ఆయన కష్టం ఎప్పుడు తీరుతుందో.. అని ఆయన అనుచరులు బాధపడుతున్నారు.

Similar News