కాంగ్రెస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యే

Update: 2018-05-21 12:05 GMT

కర్ణాటక ఎన్నికల అనంతరం ఎలాంటి రసవత్తర రాజకీయాలు జరిగాయో అందరికీ తెలిసిందే. గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, బలనిరూపణకు శాయశక్తులూ ఒడ్డినా కావాల్సిన మద్దతు సాధించలేకపోవడం, ఫలితంగా రాజీనామా చేయడం కూడా తెలిసిందే. అయితే, బలపరీక్షకు ముందు బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారని, డబ్బులు, పదవులతో ప్రలోభాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి పలు ఆడియో రికార్డింగులు కూడా బయటపెట్టింది. అయితే, ఇప్పుడు ఆ ఆడియో రికార్డింగులు కేవలం కల్పితమా ? లేక బీజేపీని ప్రజల్లో విలన్ చేయడం కోసమో లేదా తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ముందుజాగ్రత్తగా ఈ కల్పిత ఆడియోలు విడుదల చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రచారానికి కారణం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కావడం గమనార్హం.

మేము ఆమె గొంతని చెప్పలేదే..

యెల్లాపూర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు శివరాం హెబ్బర్ భార్యకు బలపరీక్షకు ముందు బీజేపీ నేతలు ఫోన్ చేశారని కాంగ్రెస్ వారి సంభాషణ రికార్డింగును విడుదల చేశారు. అయితే ఈ రికార్డింగులో ఉన్న గొంతు మా ఆవిడది కాదని, అసలు ఆమెకు ఎవరూ ఫోనే చేయలేదని శివరాం హెబ్బర్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ ఆడియోలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆడియో విడుదల చేసిన కాంగ్రెస్ నేత ఉగ్రప్ప కూడా ఇప్పుడు మాట మార్చాడు. ఆ ఆడియో ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లోనిదని, ఆ గొంతు ఎమ్మెల్యే హెబ్బర్ భార్యదని తాము చెప్పలేదని స్పష్టం చేశారు. ఫోన్ మాట్లాడిన మహిళ ఎమ్మెల్యే భార్యగా బీజేపీ నేతలు పొరపడ్డారని అన్నారు. అయితే, బీజేపీ నేతలకు మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే పెట్టిన పోస్టు కష్టకాలంలో ఒక ఆయుధంలా దొరికింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఆడియో క్లిప్ లతో, అబద్దాలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.

Similar News