కన్నడ హీరో ఎవరంటే?

Update: 2018-05-15 00:30 GMT

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈవీఎంలలో ఉన్న రాజకీయ పార్టీలు, నేతల భవిష్యత్ తేలనుంది. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలే అయినా ఈ ఎన్నికల తీర్పు దేశ భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది. కాంగ్రెస్ చివరి కోటను బద్దలుకొట్టి కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలనే ధ్యేయంతో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డింది. మరోవైపు కాంగ్రెస్ సైతం తాము అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం చేజారకుండా అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వకరించిన తర్వాత తొలిసారి జరిగిన కీలక ఎన్నికలు ఇవి.

దక్షిణ భారతంలో పట్టు సాధించేందుకు...

వాస్తవానికి కేంద్రంలో అత్యధిక సీట్లతో అధికారం చేపట్టినా, అన్ని రాష్ట్రాల్లో కమలం జెండా ఎగరవేస్తామని చెప్పుకుంటున్న బీజేపీకి దక్షిణ భారతంలో ఉన్న ఏకైక ఆశ కర్ణాటక మాత్రమే. కేవలం కర్ణాటకలో మాత్రమే గతంలో బీజేపీ స్వంతంగా అధికారం చేపట్టగలిగింది. ఆ పార్టీకి పూర్తిస్థాయిలో బలముంది కూడా అక్కడే. దీంతో తమకు పట్టున్న రాష్ట్రంలో పాగా వేసి మిగతా దక్షిణాది రాష్ట్రాలకు అధికారవిస్తరణ చేయాలని కలలు కంటోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీని ఓడించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కోలుకోకుండా ఆ పార్టీ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టాలనేది బీజేపీ ఆలోచన. ఇందుకు తగ్గట్లుగా ఆ పార్టీ కర్ణాటకలో గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. అవినీతికి వ్యతిరేకమనే పార్టీనే మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి పెద్దపీట వేశారంటేనే ఆ పార్టీ గెలిచేందుకు ఎంతకైనా వెనకాడలేదని స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ కే ఎక్కువ అవసరం...

కర్ణాటకలో గెలవడం అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవసరం. ఆ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ముఖ్యమైన ఎన్నికలివి. ఇటువంటి పరిస్థితిలో కర్ణాటకలో విజయం దక్కకపోతే అది రాహుల్ గాంధీ నాయకత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే దిగ్విజయంగా సాగుతోన్న మోడీ-షా ధ్వయానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు రానున్న మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే యేడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు కొంత ఉత్తేజం, నమ్మకం ఆ పార్టీ క్యాడర్లో కలిగించవచ్చు. ఇక ఇంతకాలం దక్షిణాదిలో బలంగానే ఉన్న కాంగ్రెస్ కర్ణాటకలో అధికారం కోల్పోతే ఇక ఇప్పట్లో దక్షిణాదిపై ఆశ వదులుకోవాల్సిందే. కాబట్టి, ఇక్కడ గెలిచేందుకు ఆ పార్టీ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటం ముఖ్యంగా కాదు, అధికారాన్ని సాధించడమే ముఖ్యమని గతంలో జరిగిన గోవా, మణిపూర్ ఎన్నికలు నిరూపించాయి. అంటే ఎక్కువ సీట్లు సాధించడం కన్నా అధికారాన్ని కైవసం చేసుకునేలా కాంగ్రెస్ వూహాలు ఉండాల్సి ఉంది.

కింగా...కింగ్ మేకరా...

మరోవైపు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మంచి పట్టున్న జనతాదళ్(ఎస్) తమదే అధికారం అన్న ధీమాతో ఉంది. కానీ, ప్రజల నాడి, ఎగ్జిట్ పోల్ ఫలితాలను విశ్లేషిస్తే కర్ణాటకలో జేడీఎస్ కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ముందుజాగ్రత్తగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంపూర్ణ మెజార్టీ రాకపోతే జేడీఎస్ ను కలుపుకునేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. ఆ పార్టీ నేత కుమారస్వామి సింగపూర్ వెళ్లడం వెనక మతలబు అధికార పంపిణీ చర్యలే అనే వాదన ఉంది.

ఎటూ తేల్చని ఎగ్జిట్ పోల్స్....

సర్వత్ర ఉత్కంఠ రేపుతోన్న కర్ణాటక ఎన్నికల ఫలితాలపై వివిధ ఛానెళ్లు, సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పష్టత ఇవ్వలేదు. కొన్ని సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా, మరికొన్ని సంస్థలు బీజేపీకి అనుకూలంగా ఫలితాలిచ్చాయి. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ఏర్పడే అవకాశం ఉందనే అంచనాలు వేశాయి. దీంతో ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 గంటల వరకు ఫలితాల సరిళి తెలియనుంది. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలు 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 113 స్థానాలు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ చేరవచ్చు. కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది.

 

Similar News