బొపయ్య మహా భక్తుడే...!

Update: 2018-05-18 10:49 GMT

కర్ణాటకలో ప్రొటెం స్పీకర్ ఎంపికలో సీనియారిటీని పక్కనపెట్టిన గవర్నర్ బీజేపీకి చెందిన కే.జీ.బోపయ్యను నియమించారు. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్ అవకాశం ఇవ్వాలి. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి.దేశ్ పాండే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీనియర్ గా ఉన్నారు. కానీ, ఈయనను పక్కనపెట్టి బోపయ్యకు అవకాశం ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది. బోపయ్య పక్కా ఆర్ఎస్సెస్ వాది. ఆయన్ చిన్నవయస్సు నుంచి ఆర్ఎస్సెస్ లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన జైలుకు కూడా వెళ్లాడు. విరాస్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బోపయ్య ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేశారు. 2011లో యడ్యూరప్ప ప్రభుత్వంపై 11 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు స్పీకర్ గా ఉన్న బోపయ్య వారిపై బహిష్కరణ విధించి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ఇప్పుడు మరోసారి నిబంధనలను కాదని గవర్నర్ బోపయ్యను నియమించడం ద్వారా రేపు జరగబోయే బలపరీక్షలో ఆయనను అడ్డం పెట్టుకుని కథ నడిపించాలని బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News