ఆడియో టేపుల్లో ఏపీ, తెలంగాణ వ్యవహారం

Update: 2018-05-19 10:16 GMT

కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ ముఖ్యనేతలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పలు ఆడియో టేపులను బయటపెట్టింది. వ్యూహాత్మకంగా బలపరీక్షకు ముందురోజు గాలి జనార్ధనరెడ్డి ఆడియో టేపు బయటపెట్టిన కాంగ్రెస్, మరికాసేపట్లో బలపరీక్ష జరుగుతుందనగా మరో సంచలనాత్మక ఆడియో విడుదల చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్పనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.ఎస్.పాటిల్ తో మాట్లాడి తమవైపు రావాలని ప్రలోభాలకు గురిచేశారు.

మనమే ఆదర్శమంటూ...

ఇక బీజేసీ కర్ణాటక ఇంఛార్జి మురళిధర రావు, కీలక నేత శ్రీరాములు కూడా కాంగ్రెస్ ఎమ్మల్యే బీ.ఎస్.పాటిల్ తో ఫోన్లో మాట్లాడినట్లుగా పలు ఛానళ్లు ప్రసారం చేశాయి. అయితే వీరి మధ్య జరిగిన సంభాషణలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన వచ్చింది. తమవైపు రావాలని సదరు ఎమ్మెల్యేను బీజేపీ నేతలు అడగగా, తన నియోజకవర్గంలో ప్రత్యర్థి బలంగా ఉన్నాడని, ఉప ఎన్నికలు వస్తే కష్టమని చెప్పాడు. దీనికి స్పందించిన శ్రీరాములు ఉప ఎన్నికలు వచ్చే సమస్యనే లేదని, స్పీకర్ నుమనమే ఎన్నుకుంటామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్నట్లుగానే మన వద్ద కూడా ఉంటుండని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవని భరోసా ఇచ్చారు. అంటే, కర్ణాటకలో జరుగుతున్న ఈ బేరసారాలకు, ఫిరాయింపు ప్రయత్నాలకు ఆదర్శం ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మన స్పీకర్లు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ కర్ణాటకలో ఇంతగా ప్రలోభాలు జరిగే అవకాశం ఉండేది కాదంటున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం కూడా బేరసారాలు చేయడానికి బీజేపీ నేతలకు కలిసివచ్చిన అంశమని వారి విశ్లేషణ.

Similar News