గులాబీ బాస్ సీఎంగా మరోసారి....??

Update: 2018-12-08 02:30 GMT

గులాబీ బాస్ కె.చంద్రశేఖర్ రావులో గెలుపు దీమా కనిపిస్తోంది. నిన్న జరిగిన పోలింగ్ లో క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న ఆయన ఖచ్చితంగా వంద స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటు జాతీయ ఛానెళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ దే అధికారమని తేల్చి చెప్పాయి. దీంతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టిన కేసీఆర్ ఈ నెల 12వ తేదీన ప్రమాణస్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కలసి వస్తే ఈ నెల 12వ తేదీన కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, తర్వాత మంత్రవర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని గులాబీ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం.

గ్రామీణ ప్రాంతాల్లో....

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల పూర్తిగా పాజిటివ్ వేవ్ ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పోలింగ్ సరళిని చూస్తే కేసీఆర్ కు మరోసారి అధికారం అప్పగించాలన్న ఆలోచన వారిలో కన్పించిందంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడం కూడా తమకు కలసి వచ్చే అంశంగా ఆ పార్టీ పరిగణిస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ గత నాలుగున్నరేళ్లుగా అమలు చేసిన పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నారు.

బాబు వచ్చిన తర్వాత.....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం తర్వాత తమకు ఇంకా లాభం చేకూర్చిందంటున్నారు. హంగ్ కు అవకాశాలే వేవని స్పష్టమైన మెజారిటీతో తాము అధికారంలోకి వస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం వారి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మాత్రం పనిచేయ లేదంటున్నారు. అలాగే మహాకూటమిని ప్రజలు విశ్వసించలేదని చెబుతున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ లో ఉండే పరిస్థితులను సమీక్షించారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఆయన గెలుపు తమదేనన్న ధీమాను సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కూడా రెడీ అయిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి 11వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి.

Similar News