మోదీతో మీటింగ్ తర్వాతే?

Update: 2018-12-11 10:13 GMT

ఎవరు అవునన్నా...కాదన్నా... తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారనే చెప్పకతప్పదు. శాసనసభను రద్దు చేసే ముందే కేసీఆర్ ఢిల్లీ పర్యటన బాగా ఉపయోగపడింది. అసెంబ్లీ రద్దయి నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో వెళ్లాలన్న కేసీఆర్ ఆలోచనకు మోదీ మద్దతు ఉందనేది కాదనలేని వాస్తవం. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రభావం ఉంటుందని అంచనా వేసుకున్న కేసీఆర్ ముందస్తు ఆలోచన చేశారు. అయితే శాసనసభ రద్దయిన వెంటనే ఎన్నికలు జరిగితే దానికి ప్రతిఫలం ఉంటుంది. అలాకాకుండా రద్దయినా లోక్ సభ ఎన్నికలప్పుడే తెలంగాణ ఎన్నికలు జరిపితే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రయోజనం ఉండదు.

సహకరించిన మోదీకి.....

అందుకే కేసీఆర్ శాసనసభ రద్దు చేయడానికి ముందుగానే ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలతో మంతనాలు జరిపారంటారు. అలాగే ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరగడానికి కారణం కూడా కేంద్ర పెద్దలే అన్నది వాస్తవం. రాజకీయ సభల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమే అయినా కేసీఆర్, మోదీ మంచి మిత్రులు. పార్లమెంటు సాక్షిగానే కేసీఆర్ మెచ్యూరిటీని మోదీ ప్రశించడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్డీఏలో చేరకుండా బయట ఉండే రాష్ట్ర ప్రధాన డిమాండ్లను కేసీఆర్ తీర్చుకోగలిగారు. ప్రధానంగా జోన్ల విషయంలోనూ కేసీఆర్ కు మోదీ సహకరించారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లి మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకం చేస్తున్నవేళ మోదీతో మీటింగ్ తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.

Similar News