ఫ్యాన్ ఓవర్ స్పీడ్ లో ఉందా..?

Update: 2018-08-09 11:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. ఆయన ఇంతకుముందు వెంకయ్య నాయుడు ఆహ్వానం మేరకు బీజేపీలో చేరారు. అయనను పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశంతో పాటు వైసీపీ కూడా ప్రయత్నించాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఆయనను పిలిపించుకుని పార్టీలో చేరాలని ఆహ్వానించారు. టీడీపీ తరుపున నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిశారు.

వైసీపీ కే ఓటేసిన నేదురుమల్లి క్యాడర్

అయితే, ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తలు, అనుచరుల అభీష్ఠానికే వదిలేసిన రామ్ కుమార్ రెడ్డి బుధవారం, గురువారం వారిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనకు రెండు పార్టీల నుంచి ఆహ్వానం ఉందని, ఇద్దరు అధినేతలను కలిశానని కార్యకర్తలకు వివరించారు. అధినేతలు తనతో ఏమి చెప్పారో కూడా కార్యకర్తలకు చెప్పి నిర్ణయాన్ని వారికే వదిలారు. అయితే, ఎక్కువ మంది కార్యకర్తలు, అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని కోరడంతో ఆయన ఆ పార్టీలో చేరిక ఖాయం చేసుకున్నారు. త్వరలోనే జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన వైసీపీ గూటికి చేరుతున్నందున ముందుగానే స్పందించిన బీజేపీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.

మరి ఇద్దరినీ ఎలా సెట్ చేస్తారో..?

ఇక ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి కూడా ఆషాడ మాసం వెళ్లగానే వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. నెల్లూరు రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన రెండు బలమైన కుటుంబాలు వైసీపీలోకి చేరనుండటంతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆనం రాంనారాయణరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఇద్దరూ వెంకటగిరి టిక్కెట్ పైనే కన్నేశారు. వాస్తవానికి ఆనం ఆత్మకూరు నుంచి పోటీచేయడానికి ఉత్సాహం చూపినా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్నారు. దీంతో ఆనంకి వైసీపీ వెంకటగిరి ఆఫర్ చేసిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి కూడా చేరుతుండటంతో ఇద్దరినీ ఎలా సెట్ చేస్తారో చూడాలి.

Similar News