జేసీ వ్య‌వ‌హారంపై త‌ల‌ప‌ట్టుకున్న టీడీపీ

Update: 2018-07-19 09:01 GMT

తెలుగుదేశం పార్టీ ప్రవేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మాణంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నేత‌లు అన్ని రాష్ట్రాల‌కు, అన్ని పార్టీల‌కు చెందిన ఎంపీల‌ను క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే, బ‌య‌ట ఇంత క‌ష్ట‌ప‌డుతున్న ఆ పార్టీకి సొంత పార్టీ ఎంపీనే షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలంతా ఢిల్లీలో ఎంపీల మ‌ద్ద‌తు కోసం తిరుగుతుంటే, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మాత్రం అస‌లు పార్ల‌మెంట్ స‌మావేశాల‌కే హాజ‌ర‌య్యేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. త‌మ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మాణం వీగిపోతుంద‌ని, అస‌లు న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా ఉండ‌గా ప్ర‌త్యేక హోదానే రాదు అని టీడీపీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు.

బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు

దీంతో ఇప్పుడు జేసీ విష‌యంలో ఏమి చేయాలో తెలియ‌క ఆ పార్టీ అధిష్ఠానం త‌ల‌ప‌ట్టుకుంది. ఎంపీలు సైతం జేసీ వ్య‌వ‌హార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. స‌భ‌కు హాజ‌ర‌వ‌డంపై ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తామ‌ని పైకి చెబుతున్నా లోప‌ల మాత్రం జేసీ పార్ల‌మెంట్ కు హాజ‌ర‌య్యేలా చూడాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిని హుటాహుటిన విజ‌య‌వాడ‌కు పిలిపించుకున్నారు పార్టీ అధినేత‌. అస‌లు, జేసీ ఎందుకు ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..? ఆయ‌న‌కు స్థానికంగా ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జేసీ దివాక‌ర్ రెడ్డి శుక్ర‌వారం కచ్చితంగా స‌భ‌కు వ‌స్తార‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.

Similar News