ఎన్నికల శంఖారావం పూరించిన జగన్

టీడీపీ దుర్మార్గ పాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఎన్నికలు ఏకైక అవకాశంగా వచ్చాయని, మార్పు, విలువలు, విశ్వసనీయత కోసం వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత [more]

Update: 2019-03-11 11:55 GMT

టీడీపీ దుర్మార్గ పాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఎన్నికలు ఏకైక అవకాశంగా వచ్చాయని, మార్పు, విలువలు, విశ్వసనీయత కోసం వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో సమర శంఖారావం సభలో ఆయన పాల్గొని ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఎన్నికలప్పుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చి టీడీపీ ఎలా మాట తప్పింది అనే విషయం ప్రతీ ఇంట్లో, గ్రామంలో చర్చ జరగాలని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలు ఎలాంటి అన్యాయాలు, దుర్మార్గాలకు పాల్పడ్డాయో, ఎన్నికల ముందు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రలోభాలపై చర్చ జరగాలన్నారు. రాజధానిలో తాత్కాలిక భవనాలు మినహా శాశ్వతం పేరుతో జరగని అభివృద్ధిపై, బీటలు వారుతున్న పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరగాలని తెలిపారు. మమతలు, మానవత్వం లేకుండా ఎన్టీఆర్, హరికృష్ణ మృతదేహాలను పక్కన పెట్టుకుని చంద్రబాబు చేసిన శవరాజకీయాలపై చర్చ జరగాలన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నీరుగారిపోవడంపై, బెల్ట్ షాపులు పెరిగిపోవడంపై, మహిళలకు భద్రత లేకపోవడంపై గ్రామాల్లో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.

యెల్లో మీడియాతోనూ మన యుద్ధం…

ప్రపంచంలోనే నెంబర్ 1 అవినీతిపరుడు, ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన నేరగాడు, తనకు ఓట్లేయరని ఓట్లే తీసివేయిస్తున్న నేరగాడు చంద్రబాబును యెల్లో మీడియా భూజాన మోస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఇంటెలిజెన్స్ పోలీసులను చంద్రబాబు వాచ్ మెన్లుగా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేర్చిన దొంగ ఓట్లను పరిశీలించి తొలగించాలని తాము ఫారం-7 ఇస్తే, న్యాయం చేయమని అడగడమే తప్పని వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా చంద్రబాబు కేసులు పెడుతున్నారని అన్నారు. ఫారం-7 విషయంలో చంద్రబాబే దొంగతనం చేసి మళ్లీ మిద్దెనెక్కి దొంగా..దొంగా అని అరుస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికాక తానే రాజీపడి, విభజన చట్టం ద్వారా రావాల్సిన వాటిని వదులుకొని వచ్చినట్లు చంద్రబాబే ఒప్పుకున్నారని తెలిపారు. ఈ నెల రోజులు ఓట్ల కోసం చంద్రబాబు అనేక మోసాలు చేస్తారని, ఎన్నో డ్రామాలు, సినిమాలు చూపిస్తారన్నారు. ఈ డ్రామాలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మిగతా యెల్లో మీడియాలో కనిపిస్తుందన్నారు. ఈ మీడియా సంస్థలన్నీ చంద్రబాబుకు అమ్ముడుపోయాయన్నారు. టీడీపీ ఓట్ల కోసం ఇచ్చే డబ్బులకు లొంగిపోవద్దని, వైసీపీ అధికారంలోకి వస్తే కలిగి లబ్ధిని ప్రజలకు తెలియజేయాలని జగన్ బూత్ కమిటీ సభ్యులను కోరారు. ఈ ఎన్నికలు ప్రజలకు, రాక్షసులకు మధ్య.. నీతికి, అవినీతికి మధ్య.. విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య.. ప్రజాస్వామ్యానికి, అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ప్రజలకు చెప్పాలన్నారు.

అన్ని పార్టీలూ అన్యాయం చేశాయి

రాష్ట్రానికి అన్ని పార్టీలూ అన్యాయం చేశాయని జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాను పక్కన పెట్టి బీజేపీతో సంసారం చేశారని, ఇప్పుడు విడాకులు ఇచ్చి ఎన్నికలు వచ్చాక మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా హామీని విభజన చట్టంలో చేర్చకుండా మరో అన్యాయం చేసిందన్నారు. బీజేపీ కూడా రాష్ట్రాన్ని మోసం చేసిందని, నరేంద్ర మోడీ పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉన్నా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రానికి నష్టమే చేశారని, గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి ఓట్లేయాలని, పనులు తాను చేయిస్తానని పవన్ ప్రచారం చేశారని ఆరోపించారు. వీరెవరినీ ఇక నమ్మవద్దని, 25కి 25 ఎంపీలు మనమే సాధించి ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే కేంద్రంలో మద్దతు ఇద్దామన్నారు.

Tags:    

Similar News