జగన్ ఇచ్చారు...ఫుల్లు క్లారిటీ.....!

Update: 2018-07-31 12:45 GMT

యూటర్న్ తీసుకోవడం తన ఇంటావంటా లేదని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు తాను కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్ లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంకా అమలు చేయకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు. కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తర్వాత కమిషన్ వేసి, నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారని పేర్కొన్నారు. తాను గతంలో చెప్పినట్లుగానే కాపు రిజర్వేషన్లకు అనుకూలమని ఆయన చెప్పేశారు. తన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన మీడియా వక్రీకరించిందని చెప్పారు.

మోసం చేసింది చంద్రబాబే.....

జఠిలమైన సమస్యపై హామీ ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. కాపులను అణగదొక్కేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిన చంద్రబాబు మోసగాడా..? కాపులకు అండగా ఉన్న జగన్ మోసగాడా .? ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. కాపులకు ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు ఇస్తానని చెప్పి 1340 కోట్లు మాత్రమే ఇచ్చాడని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కు ఐదేళ్లలో 10 వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. మత్య్సకారులను, బోయలను ఎస్సీల్లో చేరుస్తామని కూడా హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారన్నారు. తాను చేయగలిగిన హామీలే ఇస్తానని, చేయలేని హామీ ఇవ్వనని స్పష్టం చేశారు. అయితే, కాపు కార్పొరేషన్ కు 10 వేల కోట్లు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీని స్వాగతిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు కాపు యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు.

Similar News