కొత్త లుక్ లో జగన్

Update: 2018-06-12 08:19 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ మరో మైలురాయిని చేరుకోనుంది. ఆయన పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. చారిత్రక రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా ఆయన రాజమండ్రీ నగరానికి చేరుకోనున్నారు. అయితే, మంగళవారం కొత్త లుక్ లో జగన్ అభిమానులను, వైసీపీ శ్రేణులను ఆకట్టుకున్నారు. ఆయన సంప్రదాయ పంచె కట్టులో గోష్పాడు క్షేత్రంలో పూజలు నిర్వహించారు. అనంతరం గోదారమ్మకు పూజలు చేశారు. అనంతరం పంచెకట్టు లోనే జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

మొత్తం పాదయాత్రకే హైలైట్ సీన్...

కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రారంభమైన జగన్ పాదయాత్ర నిర్వరామంగా సాగుతోంది. ఒక్కో జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఇంకో జిల్లాకు ప్రవేశించే సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు జగన్ కు జిల్లాలోకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అయితే, ఇదే రీతిలో తూర్పు గోదావరి జిల్లాకు కూడా జగన్ కి ఘనంగా స్వాగతం పలికేందుకు శ్రేణులు ఏర్పాటుచేశాయి. మొత్తం 19 నియోజకవర్గాల నుంచి ఇందుకు పెద్దఎత్తున పార్టీ నేతలు రాజమండ్రికి తరలివస్తున్నారు. నగరం మొత్తం వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ముఖ్యంగా గోదావరి నదిలో 500 పడవల్లో జెండాలతో మత్య్సకారులు ప్రదర్శనగా జగన్ కి స్వాగతం పలుకుతున్నారు. ఈ సీన్ మొత్తం పాదయాత్రకే హైలైట్ అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.

బ్రిడ్జీపై ఆంక్షలు...

గతంలో జగన్ కృష్ణా నది మీదుగా విజయవాడకు చేరుకుంటున్న సమయంలో పెద్దఎత్తున ప్రజలు జగన్ పాదయాత్రలో ఉండటంతో బ్రిడ్జీ ఊగింది. దీంతో కొద్దిసేపు ఎక్కడివారు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో రాజమండ్రి బ్రిడ్జీపై కూడా ఇటువంటి సంఘటన జరగకుడా వైసీపీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. బ్రిడ్జీ మీదుగా కేవలం నడిచేవారికి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. వాహనాలకు అనుమతి లేదు. బ్రిడ్జి రెయిలింగ్ కూడా దృడంగా లేకపోవడంతో వాటి దగ్గరకు పార్టీ శ్రేణులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రిడ్జీ మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బ్రిడ్జీ మీదకు చేరుకోనున్నారు.

Similar News