జగన్ గాయం ...తెలుసుకోవాల్సిన నిజాలు

Update: 2018-10-26 14:22 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. చిన్న గాయానికే జగన్ డ్రామా చేస్తున్నారని... అసలు ఆ గాయం చెయించుకుందే జగన్ అని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. దీంతో టీడీపీ అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శల దాడి, వెక్కిరింతలకు దిగుడుతున్నారు. ముఖ్యంగా వారు రెండు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వైద్య శాఖకు సంబంధించిన ఈ ప్రశ్నలకు పలువురు వైద్య నిపుణులు సమాధానం ఇస్తున్నారు. అసలు టీడీపీ అనుమానాలేంటీ..? వైద్యుల సమాధానం ఏంటో చూద్దాం.

టీడీపీ ఆరోపణ : విశాఖపట్నంలో అర సెంటీమీటరు గాయం, హైదరాబాద్ ఆసుపత్రిలో పెద్దదిగా చూపించి తొమ్మది కుట్లు వేశారని డ్రామా చేస్తున్నారు.

వైద్య నిపుణుల వివరణ : భూజం కింది బాగంలో గాయం జరిగింది. అక్కడ రేడియల్ నర్వ్ ఉంటుంది. రేడియల్ నర్వ్ కి గాయమైతే ఆ చేతితో ఎక్కువ పని చేయలేరు. సదరు నరానికి గాయం జరిగితే వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. జగన్ కి జరిగిన గాయం చిన్నదే అయినా రేడీయల్ నర్వ్ కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అని గాయాన్ని కొద్దిగా వెడల్పు చేసి పరీక్షించడం తప్పనిసరి. ఏ వైద్యుడైనా ఇదే చేస్తారు. అందుకే ఇటువంటివి గాయాలు జరిగినప్పుడు వైద్యులు పేషెంట్లను న్యూరో స్పెషలిస్టులతో చూయించుకోవాలని సూచిస్తారు. రేడియల్ నర్వ్ కి గాయం జరిగిందేమో చూడటానికే వైద్యులు జగన్ గాయం పెద్దది చేశారు. కాబట్టి, తొమ్మిది కుట్లు వేయాల్సి వచ్చిందేమో. కుట్ల సంఖ్యకు, గాయం పరిణామానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు.

- ఇక జగన్ పై దాడి చేసింది కోడికి కట్టే కత్తి కావడం, ఆ కత్తికి విషయం లేదా ఇతర ప్రమాదకర రసాయనం పూసే అవకాశం ఉందని అనుమానించారు. అందుకే పూర్తిగా పరీక్షించడానికి గాయాన్ని కొంత వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుంది.

టీడీపీ మరో ఆరోపణ : గాయం జరిగాక హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అందరికి నమస్కారం పెడుతూ, చిరునవ్వుతో వచ్చి... ఇప్పుడు పెద్ద కట్టు కట్టుకుని డ్రామా చేస్తున్నారు.

వైద్య నిపుణుల వివరణ : జగన్ కు ముందు జరిగిన గాయం చిన్నదే కావచ్చు. కానీ, వైద్యులు చికిత్సలో భాగంగా రేడియల్ నర్వ్ ను పరిశీలించేందుకు, విష ప్రయోగం జరిగిందా చూడటానికి గాయం పరిణామాన్ని లోతును పెంచడం తప్పనిసరి. అంటే గాయం పరిణామం పెరిగింది. కాబట్టి, చేతికి కనీసం ఐదు రోజుల రెస్ట్ అవసరం. ఈ ఐదు రోజులు చేయి కదలకుండా పట్టి వేయడం సహజం. వైద్య పరిజ్ఞానం ఉన్నవారికి ఈ విషయాలపై అవగాహన ఉంటుంది.

Similar News