మూడు పార్టీలూ ముంచేశాయి...

Update: 2018-07-21 07:00 GMT

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక మోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చపై జగన్ శనివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. ప్రజల్లో బలమైన ఆకాంక్షగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్మరించాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అర నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదని, బీజేపీ నేతలు సైతం ప్రత్యేక హోదా గురించి ఏమీ చెప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఉన్న ప్రేమను చూస్తే బాధేస్తుందన్నారు.

లోక్ సభలో మాట్లాడింది మా మాటలు కావా..?

నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన టీడీపీ ఎన్నికల వేళ బయటకు వచ్చి బీజేపీది మాత్రమే తప్పు అన్నట్లుగా చెబుతున్నారని, రాష్ట్ర ప్రజలను టీడీపీ కూడా మోసం చేసిందని జగన్ విమర్శించారు. తాను గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని చెబుతూ, లేవనెత్తిన అంశాలనే టీడీపీ పార్లమెంటులో మాట్లాడిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా నిజాయితీగా పోరాడాలని, మొత్తం అందరు ఎంపీలనూ రాజీనామా చేయించి నిరాహార దీక్ష చేయించాలన్నారు. దీంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం దేశప్రజలందరికీ తెలుస్తుందన్నారు. ఇందుకు రాజీనామాలు చేసిన తమ ఎంపీలు కూడా కలిసివస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తీరని మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను నమ్మి సర్వం కోల్పోయామని, ఇక ఆ పార్టీలను నమ్మవద్దని కోరారు. 24వ తేదీన బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News