కాంగ్రెస్ లో వింత పరిస్థితి ...!!

Update: 2018-12-27 02:30 GMT

అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వున్నాయి. అయినా కూడా నిన్నమొన్నటి వరకు వీరోచితంగా అధికారపార్టీపై యుద్ధం చేసిన వీరులెవ్వరు వచ్చే మరో రెండు యుద్ధాలకు సిద్ధంగా లేరు. కానీ ఒక విచిత్ర పరిస్థితి మాత్రం హస్తం పార్టీలో కనిపిస్తూ చర్చనీయం అయ్యింది.

పార్లమెంట్ కు మాత్రం అంతా రెడీ ...?

ఇటీవల ఎన్నికల్లో ఒడిన వారిలో చాలామంది పార్టీ అధికారంలోకి వచ్చి అదృష్టం వరిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎక్కేంత అనుభవశాలులే. కానీ ముఖ్యమంత్రి పదవి దేముడెరుగు అసలుకే ఎసరు వచ్చి సొంత నియోజకవర్గాల్లో ఝలక్ లు తగిలి డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడమే గగనం అన్న టాక్ వుంది. అయితే దీనికి భిన్నమైన వాతావరణం టి కాంగ్రెస్ లో నడుస్తుంది. తమకు మరో ఛాన్స్ ఇస్తే చాటుతామని ఎంపీ టికెట్ల కోసం లైన్లో వున్నారు పరాజితులు.

రెడీగా వున్నది వీరే ...

వీరిలో మహబూబ్ నగర్ నుంచి డికె అరుణ, రేవంత్ రెడ్డి రెడీ గా వున్నారు. వీరికి పోటీగా జైపాల్ రెడ్డి కూడా సై అంటున్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి సైతం ఇదే ఆశిస్తున్నారు. ఎంపి టికెట్ దక్కితే పోయిన పరువు దక్కించుకుంటామని రెడీ అయిపోయారు. ఇదే రీతిలో షబ్బీర్ ఆలీ, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, సురేష్ శెట్కార్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటామని అధిష్టానం కి అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీకే ఎవరు దొరకని ఆందోళన చెందిన అధిష్టానం కి నేతలు ఎక్కువ కావడంతో మరోసారి టికెట్ల ఫైనల్ చేయడం సమస్య కానుంది.

Similar News