క్లారిటీ వచ్చేస్తుందా....??

Update: 2018-12-26 02:30 GMT

కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత ఎంపికపై సీనియర్ నేతలందరూ పోటీ పడుతుండటంతో ఈ పంచాయతీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు చేరింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా సీఎల్పీ నేత ఎంపిక జరగకపోవడానికి కారణం నేతల మధ్య పోరేనని చెబుతున్నారు. దీంతో సీఎల్పీ నేత పదవి కోసం పోటీ పడుతున్న ఐదుగురికి టెన్ జన్ పథ్ నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీతో జరిగే సమావేశం తర్వాత సీఎల్పీ నేత ఎవరనే క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఐదుగురి మధ్య పోటీ....

సీఎల్పీ పదవి కోసం మొత్తం ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ఈ పదవి ఎంపిక కోసం ఇక్కడే కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని హైకమాండ్ ఆదేశించింది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా విడివిడిగా వీరితో మాట్లాడినా ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఎవరికి వారే తమకేపదవి కావాలని పట్టుబట్టడంతో ఈ పంచాయతీ రాహుల్ వద్దకు వెళ్లింది.

ఢిల్లీలో పంచాయతీ....

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇంత దారుణంగా రావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలే కారణమంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తున్నారు. అటువంటి వారికి మరోసారి పదవి ఇవ్వడం మంచిది కాదని, పీసీసీని కూడా ప్రక్షాళన చేస్తేనే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో గెలిచే అవకాశముంటుందని ఆయన వాదిస్తున్నారు. ఉత్తమ్ కూడా తనకు సీఎల్పీ పదవి అవసరం లేదనే చెబుతున్నట్లు సమాచారం. మల్లు భట్టి విక్రమార్క మాత్రం తన సీనియారిటీ, సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు సమాచారం.

ఎవరికి అనేది...?

అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు. సబితా ఇంద్రారెడ్డి సీనియర్ నేత అయినా ఆమె వాగ్దాటి నేత కాదనేది అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరుపున గత ఎన్నికల్లో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అయితే ఈ పదవికోసం పోటీ మాత్రం ఐదుగురి మధ్యనే ఉంది. రాహుల్ తో ఈరోజు జరిగే భేటీ తర్వాత సీఎల్పీ నేత ఎవరో తేలిపోనుందని చెబుతున్నారు.దీంతో పాటు పీఏసీ ఛైర్మన్ పదవి విషయంపై కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. పీఏసీ కమిటీ ఛైర్మన్ గా ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Similar News