మోడీని విలన్ చేసేందుకు...?

Update: 2018-05-17 12:17 GMT

కర్ణాటకలో బీజేపీ ప్లే చేస్తున్న పవర్ పాలిటిక్స్ ఆ పార్టీ అధికారంలో ఉన్న పలు ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన గోవా, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా కూడా ఎన్నికల అనంతరం పొత్తు కుదర్చుకుని బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఆయా రాష్ట్రాల గవర్నర్ లు కూడా అతిపెద్ద పార్టీలను కాకుండా వీరినే అధికారం చేపట్టేందుకు ఆహ్వానించారు. అప్పట్లో ఆ నిర్ణయాలు బీజేపీకి అనుకూలించాయి. అయితే, కర్ణాటకలో పరిస్థితి విరుద్ధం. ఇక్కడ బీజేపీ అతిపెద్ద పార్టీ అయినా ఎన్నికల అనంతరం పొత్తులతో కాంగ్రెస్, జేడీఎస్ కు ఎక్కువ సీట్లు ఉన్నాయి. గోవా, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో అవలంభించిన పద్ధతిని చూస్తే బీజేపీ ని కాకుండా కాంగ్రెస్, జేడీఎస్ కూటమినే అధికారం చేపట్టేందుకు పిలవాలి. కానీ, ఇక్కడ గవర్నర్ మాత్రం బీజేపీని పిలిచారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

గవర్నర్లను కలిసేందుకు...

ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా గతంలో అతిపెద్ద పార్టీలను అధికారం చేపట్టేందుకు ఆహ్వానించని గవర్నర్ లకు, అధికార పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టనుంది. మొత్తానికి కర్ణాటక ఇష్యూతో బీజేపీని జాతీయ స్థాయిలో ఎండగట్టాలనుకుంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ రెండూ ఇప్పుడు గత నిర్ణయాలను తవ్వి తీస్తున్నారు. గతంలో గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కర్ణాటక మాదిరిగా అతిపెద్ద పార్టీలైన తమను అధికారం చేపట్టేందుకు ఆహ్వానించాలని కోరుతున్నారు. ఈ మేరకు గోవా, మణిపూర్ ల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్, బిహార్ లో ఆర్జేడీ నేతలు ఆయా రాష్ట్రాల గవర్నర్ లను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అపాయింట్ మెంట్లను కూడా అడిగారు. ఇక గోవాలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రస్తుతం దేశంలో కూడా లేరు. ఆయన శస్త్రచికిత్స కోసం విదేశాల్లో ఉన్నారు. గవర్నర్లు తమకు అనుకూలంగా నిర్ణయం తీసుంటారనే ఆశ లేకున్నా, బీజేపీని జాతీయస్థాయిలో విలన్ ను చేయడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దెశ్యంగా కనిపిస్తోంది.

Similar News