మోదీకి ప్రత్యర్థి ఆయనే...ఓ సర్వే

Update: 2018-08-21 09:58 GMT

‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ బాగా పెరిగినట్లు తేలింది. రానున్న 2109 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి దీటైన అభ్యర్థి రాహుల్ గాంధీనేనని తేలింది. 2016లో ఈ విషయంలో రాహుల్ కు 23 శాతం ఓట్లు మాత్రమే రాగా, ఇప్పుడు ఏకంగా 46 శాతం ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మోదీకి సరైన ప్రత్యర్థి రాహుల్ గాంధీనే అని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది వారే అధికం

2019లో మోదీకి ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరని నిర్వహించిన ఈ సర్వేలో 12,100 మంది పాల్గొన్నారు. వీరిలో రాహుల్ కి 46 శాతం మంది ఓట్లే శారు. రాహుల్ కి ఓట్లేసిన వారిలో 47 శాతం మంది ముస్లింలు ఉండగా, 45 శాతం మంది హిందువులు ఉన్నారు. ఉత్తరాధితో పోలిస్తే దక్షిణాది నుంచే రాహుల్ గాంధీకి ఎక్కువ మద్దతు ఉన్నట్లుగా తేలింది. రాహుల్ కు ఓటేసిన వారిలో 56 శాతం మంది దక్షిణాది వారే ఉన్నారు.

ప్రభ కోల్పోతున్న కేజ్రీవాల్...

ఇక ఈ సర్వేలో రాహుల్ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమె మోదీకి ప్రత్యామ్నాయమని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆమె తర్వాత 6 శాతం ఓట్లతో ప్రియాంక గాంధీ, పి.చిదంబరం మూడో స్థానంలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు 4 శాతం మంది ఓటేశారు. ఇక గత ఎన్నికల్లో ప్రధాని రేసులో ఉంటారనుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభ రోజురోజుకు తగ్గుతున్నట్లు సర్వేలో తేలింది. మోదీకి ప్రత్యామ్నాయంగా 2016లో 12 శాతం మంది ఆయన పేరు చెప్పగా, తాజాగా నిర్విహించిన సర్వేలో కేవలం 4 శాతం మాత్రమే ఆయనకు ఓటేశారు. మొత్తానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ క్రమంగా మోదీకి పోటీ ఇచ్చే వ్యక్తిగా ఎదుగుతున్నట్లు కనపడుతోంది.

Similar News