ఇమ్రాన్ పిలిస్తే.... మోదీ వెళ్తారా..?

Update: 2018-07-31 10:26 GMT

ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రిజియనల్ కోఆపరేషన్(సార్క్) దేశాధినేతలు అందరినీ ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయమై పార్టీలో చర్చించామని, విదేశీ వ్యవహారాల మంతృత్వ శాఖతో చర్చించి ఎవరెవరిని ఆహ్వనించాలో నిర్ణయించనున్నట్లు పీటీఐ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇమ్రాన్ కు ఫోన్ చేసిన మోదీ

పాక్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్ కు సోమవారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షి సంబంధాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కావాలని మోదీ ఆకాంక్షించారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఇమ్రాన్...చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎన్నికల్లో విజయం తర్వాత కూడా ఇమ్రాన్ ఇదే విషయం చెప్పారు. భారత్ తో సత్సంబంధాలకు పాక్ సిద్ధంగా ఉందని, ఈ దిశగా భారత్ ఒక అడుగు ముందుకేస్తే పాక్ రెండు అడుగులు వేస్తుందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. మోదీ విజయం తర్వాత ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఢిల్లీ రాగా, 2015లో షరీఫ్ పుట్టినరోజు వేడుకకు మోదీ లాహోర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, తర్వాతి పరిణామాలతో ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో పాక్ కాల్పులు, ప్రతిగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగాలేవు. ఇమ్రాన్ ఒకవేళ మోదీని ఆహ్వానించి, ఆ ప్రమాణస్వీకారానికి మోదీ హాజరైతే ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు మళ్లీ అడుగులు పడే అవకాశం ఉంది.

Similar News