భారత్ తో సంబంధాలపై ఇమ్రాన్ వ్యాఖ్యలు

Update: 2018-07-26 13:06 GMT

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ భారత్ పట్ల ఎటువంటి వైఖరితో ఉంటారనేది ఇప్పుడు మన దేశ ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న. గత ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పదేపదే ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది అర్థంకాని విషయంగా మారింది. అయితే, ఎన్నికల్లో విజయం అనంతరం ఇమ్రాన్ ఖాన్ గురువారం ఇస్లామాబాద్ లో మొదటిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్య అంశాలు...

* 22 సంవత్సరాల పోరాటం తర్వాత అల్లా పాకిస్థాన్ కు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చాడు.

* పాకిస్థాన్ కోసం జిన్నా కన్న కలలను నెరవేర్చేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను.

* ఎన్నో క్లిష్ట పరిస్థితుల మధ్య జరిగిన చరిత్రాత్మక ఎన్నికలివి. ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రజలకు, మిలిటరీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

* పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం బలోపేతం అవుతోంది.

* దేశంలో అవినీతిని అంతం చేస్తా. వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకువస్తా. ఇది నా నుంచి మొదలవుతుంది.

* చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్ అత్యంత ఆర్థిక సవాల్ ను ఎదుర్కొంటోంది.

* ఉద్యోగాల కల్పనకు పెట్టబడులు కీలకం. దేశాన్ని పెట్టుబడులకు అనుకూలంగా మార్చి, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తాం.

* అభివృద్ధిలో చైనా మోడల్ ను అమలు చేస్తాం.

* దేశం కష్టాల్లో ఉన్నప్పుడు రాజసౌధం లాంటి ప్రధాని బంగ్లాలో నేను ఉండలేను. ప్రధాని భవనాన్ని విద్యా సంస్థగా మారుస్తాం.

* పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఏర్పాటుచేసుకుటాం. చైనాతో సంబంధాలు మరింత మెరుగుపరుస్తాం.

* అఫ్ఘనిస్తాన్ లో శాంతి ఈ ప్రాంతానికి ఎంతో ముఖ్యం

భారత్ తో సంబంధాలపై...

* భారత మీడియా తనను బాలీవుడ్ విలన్ గా చూపించింది.

* భారత్ తో సత్సంబంధాలు ఉపఖండానికి ఎంతో ముఖ్యం. భారత్ తో వ్యాపార సంబంధాల మెరుగుకు కృషి చేస్తాం.

* కశ్మీర్ లో 30 ఏళ్లుగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* కశ్మీర్ లో పరిస్థితులకు పాక్ కారణమని బదనాం చేస్తున్నారు. అలా అంటే బలూచిస్థాన్ లో పరిస్థితులకు భారత్ కారణమా..?

* కశ్మీర్ లో శాంతి ఇరుదేశాలకు అవసరం. ఇటువంటి ఆరోపణలు మానుకుని కూర్చని, మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుందాం.

* సైన్యం ఎప్పుడూ కశ్మీర్ సమస్యను పరిష్కరించలేదు. చర్చలు మాత్రమే పరిష్కారం చూపగలవు.

* భారత నేతలతో సత్సంబంధాలు నెరపడానికి సిద్ధంగా ఉన్నాను.

Similar News